రాహుల్ నోట ఆ మాట చెప్పించు ర‌ఘువీరా!

Update: 2017-12-11 05:05 GMT
న‌మ్మి రెండోసారి అధికారాన్ని అప్ప‌గించిన పాపానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల గొంతు కోసేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఏపీకి తీవ్ర న‌ష్టం వాటిల్లేలా చేయ‌టాన్ని సీమాంధ్ర‌ప్ర‌జ‌లు ఎప్ప‌టికి మ‌ర్చిపోలేరు. విభ‌జ‌న‌పై కాంగ్రెస్ అధినేత్రి సోనియా తీసుకున్న నిర్ణ‌యం పుణ్య‌మా అని ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఆన‌వాళ్లు లేకుండా పోయాయి. ఆ పార్టీ ప్ర‌భావం ఈ రోజు ఏపీలో మ‌చ్చుకు కూడా క‌నిపించ‌ని ప‌రిస్థితి.

చిరంజీవి.. కేవీపీ.. ర‌ఘువీరా లాంటి కొద్ది మంది ఇంకా కాంగ్రెస్ పార్టీలో మిగిలిన‌ప్ప‌టికీ.. భ‌విష్య‌త్తు ఏ మాత్రం ఆశాజ‌నంగా క‌నిపించ‌టం లేదు. కాలం గ‌డుస్తున్న కొద్దీ కాంగ్రెస్ మీద ఏపీ ప్ర‌జ‌ల‌కు కోపం అంత‌కంత‌కూ పెరుగుతుందే త‌ప్పించి త‌గ్గ‌టం లేదు. విభ‌జ‌న నిర్ణ‌యం కార‌ణంగా ఏపీ ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి గురి కాక త‌ప్ప‌ద‌న్న అంచ‌నా సోనియ‌మ్మ వేసుకున్న‌ప్ప‌టికీ.. అది మ‌రీ ఇంత దారుణంగా ఉంటుంద‌న్న విష‌యం కాంగ్రెస్‌ కు కాస్త లేట్ గా అర్థ‌మైంది.

అయితే.. అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోవ‌ట‌మే కాదు.. క్లిష్ట స‌మ‌యాల్లో త‌మ‌కు అండ‌గా నిలిచిన ఏపీ ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల్ని ఇప్ప‌ట్లో పొంద‌లేమ‌న్న విష‌యం దాదాపు క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్లే. ఇలాంటి వేళ కాంగ్రెస్‌ కు క‌నిపిస్తున్న దారి ఒక్క‌టే. విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకి ఇస్తామ‌ని ప్రామిస్ చేసిన ప్ర‌త్యేక హోదాపై మోడీ స‌ర్కారు హ్యాండ్ ఇచ్చిన నేప‌థ్యంలో.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తాన‌న్న భారీ ఆఫ‌ర్ పార్టీకి మ‌ళ్లీ జీవం పోసే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

దింపుడు క‌ళ్లెం లాంటి ప్ర‌త్యేక హోదా  డిమాండ్‌ ను తెర మీద‌కు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ఏపీ పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి. తాజాగా అనంత‌పురం జిల్లా క‌ల్యాణ‌దుర్గం మండ‌లంలో ఇందిర‌మ్మ శ‌త‌జ‌యంతి ఉత్సవాల్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ర‌ఘువీరా మాట్లాడుతూ.. విభ‌జ‌న చ‌ట్టంలో ప్ర‌త్యేక హోదా అంశం ఉన్న‌ప్ప‌టికీ బీజేపీ.. టీడీపీ ప్ర‌భుత్వాలు ఆ విష‌యాలు ప‌ట్టించుకోవ‌టం లేద‌న్నారు.

రాహుల్ గాంధీ ప్ర‌ధాన‌మంత్రి అయ్యాక ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా క‌ల్పించే ఫైల్ మీద‌నే తొలి సంత‌కం పెడ‌తారని వ్యాఖ్యానించారు. ర‌ఘువీరా మాట‌లు విన్నంత‌నే కాంగ్రెస్ మీద ప్రేమాభిమానాలు ప్ర‌ద‌ర్శించే మొద‌టికే మోసం క‌ల‌గ‌టం ఖాయం. ఎందుకంటే.. హోదా అంశం మీద రాహుల్ గాంధీ ఇప్ప‌టివ‌ర‌కూ త‌న అభిప్రాయాన్ని చెప్పింది లేదు. ఇప్పుడేదో ర‌ఘువీరారెడ్డి నాలుగు మాట‌లు చెప్పి హ‌డావుడి చేసే క‌న్నా.. ఏపీ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌కు తామెంత ప్రాధాన్య‌త ఇస్తామ‌న్న విష‌యాన్ని రాహుల్ నోటి నుంచే చెప్పిస్తే బాగుంటుంది. ఆ ధైర్యం ర‌ఘువీరాకు ఉందా? ఉంటే.. ముందు రాహుల్ చేత విస్ప‌ష్ట ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత ర‌ఘువీరా చెబితే బాగుంటుంది.
Tags:    

Similar News