రాహులా.. తెలంగాణ కాంగ్రెస్ కు నువ్వే దిక్కయ్యా?

Update: 2022-09-12 08:49 GMT
కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించడానికి రాహుల్ గాంధీ 'భారత్ జోడో'యాత్ర చేపట్టారు. కన్యకుమారి నుంచి కశ్మీర్ వరకూ ఈ పాదయాత్ర సాగనుంది. ప్రస్తుతం కేరళలో పాదయాత్ర కొనసాగుతోంది. రాహుల్ గాంధీ పర్యటన తమిళనాడు కాంగ్రెస్ లో జోష్ నింపింది. రాహుల్ వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు నడిచారు. కేరళలోనూ అదే జోష్ కనిపిస్తోంది.

ఇదే ఊపును తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంటుందని కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకుంటున్నారు. ఏపీ తెలంగాణలోనూ భారత్ జోడో యాత్ర సాగనుంది. తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్ దాదాపు ఖరారైంది. అక్టోబర్ 24న రాహుల్ గాంధీ కర్ణాటకలోని రాయచూర్ నియోజకవర్గం నుంచి తెలంగాణలోని మక్తల్ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. హైదరాబాద్ శివారును టచ్ చేస్తూ మహారాష్ట్ర వెళతారు. మొత్తం మీద 15 రోజుల పాటు రాహుల్ గాంధీ తెలంగాణలో పాదయాత్ర చేస్తారు.

రాహుల్ పాదయాత్ర ఎక్కువ రోజులు తెలంగాణలో ఉండడంతో పార్టీకి పునరుజ్జీవం తెచ్చేందుకు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణలో రాహుల్ పర్యటనతో ఒక ఊపు, పార్టీకి ఊపిరి తేవడానికి డిసైడ్ అయ్యాడు. పార్టీకి ఖచ్చితంగా ఇది ఊపునిస్తుందని అంటున్నారు. మునుపటి కాంగ్రెస్ లా తయారవుతుందన్న అంచనాలు నెలకొంటున్నాయి.

ఇక ఒకప్పుడు ప్రబలంగా ఉండి.. ఇప్పుడు ఉనికే లేని ఏపీలోనూ రాహుల్ పాదయాత్ర సాగనుంది. ఆంధ్రప్రదేశ్ లో 4 రోజుల పాటు మాత్రమే రాహుల్ పాదయాత్ర సాగనుంది. రాయదుర్గం, ఆలూరు, ఆదోని, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 100 కిలోమీటర్ల సాగుతుంది.

వైసీపీకి వెళ్లిపోయిన ఓటు బ్యాంక్ ను తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. అయితే అదంతా ఈజీ కాదని అంటున్నారు. రాహుల్ పాదయాత్ర చేసినా ఏపీలో పార్టీ బలపడే సూచనలు లేవు. ఎందుకంటే కాంగ్రెస్ కు ఏపీలో బలమైననేతలే లేకుండాపోయారు.

అందుకే తెలంగాణపై మాత్రమే కాంగ్రెస్ అధిష్టానం ఆశలు పెంచుకుంది. ఆ పార్టీ ఈసారి అధికారంలోకి రావాలని కలలుగంటోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఆదరించాలని పదే పదే కోరుతోంది. రాహుల్ గాంధీ పర్యటనతో ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ ఊపు వస్తుందని అంటున్నారు. పాదయాత్ర తర్వాత పరిస్థితులు మారిపోతాయన్న గట్టి నమ్మకంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News