మాజీ సీఎం కిరణ్‌కు రాహుల్‌ పిలుపు.. ఎందుకంటే?

Update: 2022-05-17 01:03 GMT
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చిట్టచివరి ముఖ్యమంత్రిగా చరిత్ర పుటలకు ఎక్కారు.. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి. తమను చికాకులకు గురి చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం 2010లో కిరణ్‌కుమార్‌రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించింది.

అయితే.. మొదట్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పట్ల, వైఎస్‌ జగన్‌తో అంటకాగుతున్న నాటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల పట్ల కఠినంగానే వ్యవహరించారు.. కిరణ్‌. కానీ అటు జగన్‌ను ఆపలేకపోయారు. ఇటు తెలంగాణ ఉద్యమాన్ని నియంత్రించలేక చేతులెత్తేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేంద్రంలోని కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.

దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ) పేరుతో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తన తమ్ముడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డిని తన స్థానం పీలేరు నుంచి బరిలోకి దింపారు. అయితే.. జేఎస్పీకి ఒక్క సీటు కూడా రాలేదు. చివరికి తన సొంత తమ్ముడిని తన ఇలాకాలోనూ గెలిపించుకోలేకపోయారు.

దీంతో అప్పటి నుంచి రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకుని సైలెంట్‌ అయిపోయారు. మధ్యలో జనసేన పార్టీలో చేరతారని వార్తలు వచ్చినా నిజం కాలేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి తమ్ముడు కిషోర్‌కుమార్‌రెడ్డి మాత్రం తెలుగుదేశం పార్టీలో చేరారు.

2014 నుంచి దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత కిరణ్‌కుమార్‌ రెడ్డి కి కాంగ్రెస్‌ అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీల నుంచి పిలుపు వచ్చింది.మే 17న ఢిల్లీలో కిరణ్‌ వారిద్దరితో భేటీ కానున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనతో ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది. 2014, 2019 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో సీట్లు సంగతి అటుంచితే డిపాజిట్లే రాలేదు.

ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ లో కాంగ్రెస్‌ పార్టీ చింతన్‌ బైఠక్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆ పార్టీ పలు నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైంది.. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని. ఈ క్రమంలో నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఢిల్లీకి పిలిపించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సాకే శైలజానాథ్‌ ఉన్నారు.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీకి ఒకప్పుడు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీలు, ముస్లింలు, రెడ్లు ప్రస్తుతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో నడుస్తున్నారు. ఇక ఏపీలో అత్యధిక సంఖ్యలో ఉన్న కాపు సామాజికవర్గం జనసేన పార్టీ కిందకు చేరిపోయింది. ఏపీ కాంగ్రెస్‌లో రఘువీరారెడ్డి, జేడీ శీలం, కేవీపీ రామచంద్రరావు, పల్లంరాజు, సాయిప్రతాప్‌ వంటి వారు మాత్రమే మిగిలారు. వీళ్లెవరికీ మాస్‌ ఇమేజ్‌ లేదు. వీరంతా కాంగ్రెస్‌ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలతో పదవులు దక్కించుకున్నవారే. మెగాస్టార్‌ చిరంజీవిని కాంగ్రెస్‌ నమ్ముకున్నా ఆయన రాజకీయాలను పూర్తిగా వదిలేశారు. సినిమాలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ప్రధాన నేతల్లో దాదాపు 90 శాతం వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. మరో 10 శాతం మంది టీడీపీ, ఇతర పార్టీల్లో కొనసాగుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా జీవచ్ఛవంగా మారిన ఏపీ కాంగ్రెస్‌కు జవసత్వాలు కల్పించాలని కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒకప్పుడు తమకు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న రెడ్డి సామాజికవర్గాన్ని చేరదీయాలని నిశ్చయించింది. వైఎస్సార్‌ సీపీ పై రెడ్డి సామాజికవర్గంలో ఉన్న అసంతృప్తిని క్యాష్‌ చేసుకోవాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఢిల్లీ ఆహ్వానం అందింది.

నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డికి అటు చంద్రబాబుతోనూ, ఇటు వైఎస్‌ జగన్‌తోనూ తీవ్ర వైరం ఉంది. చంద్రబాబు, వైఎస్‌ జగన్‌తోపాటు కిరణ్‌కుమార్‌ రెడ్డి కూడా రాయలసీమకు చెందినవారే కావడం గమనార్హం. ఏపీలో తమకు ఈ గతి పట్టడానికి కారణమైన జగన్‌ను దెబ్బతీయడానికి అదే సామాజికవర్గానికి చెందిన కిరణ్‌కుమార్‌ రెడ్డిని రంగంలోకి దించాలని కాంగ్రెస్‌ అధిష్టానం తలపోస్తోంది. ఇందులో భాగంగా ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డికి అప్పగించడానికి సిద్ధమవుతోందనే వార్తలు వస్తున్నాయి. అలాగే పార్టీకి దూరమైన వివిధ సామాజికవర్గాలను, నేతలను మళ్లీ పార్టీకి మళ్లించే చర్యలు తీసుకోనుంది.
Tags:    

Similar News