కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై కాంగ్రెస్ యువనేత - ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ - టీఆర్ ఎస్ ఎంపీ కె.కవిత వేర్వేరుగా స్పందించారు. అయితే ఈ ఇద్దరు ఒక విషయంపై ఏకాభిప్రాయానికి రావడం ఆసక్తికరం. ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై రాహుల్ స్పందిస్తూ రాజకీయ విరాళాలపై విధించిన ఆంక్షలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. రాజకీయ విరాళాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాము మద్దతు ఇస్తామన్నారు. కానీ బడ్జెట్ ను మాత్రం ఆయన తీవ్రంగా విమర్శించారు. బడ్జెట్ లో బాణాసంచా పేలుళ్లు ఊహిస్తే, అన్నీ తుస్సుమన్నాయని ఎద్దేవా చేశారు. రైతులకు ఎటువంటి న్యాయం జరగలేదని విమర్శించారు. ఉపాధి హామీ పథకం ఉద్దేశాన్ని ప్రభుత్వం తప్పుగా అర్థం చేసుకున్నదని రాహుల్ మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత రైతులకు ఊరట కలిగించే అంశాన్ని ప్రకటిస్తామనుకున్నాం, కానీ అదేమీ జరగలేదని పెదవి వరించారు. ప్రస్తుత బడ్జెట్ వల్ల రాబోయే ఎన్నికలపై ప్రభావం ఉండదని, ఉపయోగకరమైన అంశం ఏదీలేదన్నారు.
మరోవైపు టీఆర్ ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత సైతం విరాళాలపై పారదర్శక విధానాన్ని స్వాగతించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అనంతరం స్పందిస్తూ వార్షిక బడ్జెట్ లో చాలా మంచి విషయాలు ఉన్నట్లు ఆమె అభిప్రాయపడ్డారు. అయితే పలు విషయాల్లో నిరాశకు గురిచేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎయిమ్స్ రాకపోయినా, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ట్యాక్స్ తగ్గించడం మంచి పరిణామమన్నారు. బడ్జెట్ ను పూర్తిగా చదివిన తర్వాత స్పందిస్తామని కవిత తెలిపారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగుందని పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖలకు కేటాయించిన నిధులనుంచే రాష్ట్రప్రభుత్వాలు నిధులు పొందాల్సి ఉంటుందని, ఈ విధానం వల్ల పనులు వేగవంతమవుతాయని ఆయన చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/