ఏపీకి వ‌చ్చేందుకు రాహుల్ ఓకే..ఎందుకంటే?

Update: 2018-08-25 08:51 GMT
రాజ‌కీయాల్లో ఎప్పుడేం జ‌రుగుతుందో ఎవ‌రూ ఊహించ‌లేరు. రాజ‌కీయంగా కొంద‌రు తీసుకునే నిర్ణ‌యాలు ఎలాంటి పరిణామాల‌కు దారి తీస్తాయో ఊహించ‌లేం. తెలంగాణ ఉద్య‌మం బ‌ల‌ప‌డుతున్న వేళ‌.. ఒక జ‌ర్న‌లిస్టు వేసిన ప్ర‌శ్న‌కు నాటి మంత్రి ఎమ్మెస్సార్ చేసిన వ్యాఖ్య‌.. విసిరిన స‌వాల్ తో తెలంగాణ ఉద్య‌మం రూపురేఖ‌ల్ని పూర్తిగా మార్చేసింది. ఎమ్మెస్సార్ చేసిన స‌వాల్‌ కు ప‌క్క రోజు ఉద‌యం కేసీఆర్  రియాక్ట్ కావ‌ట‌మే కాదు.. త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి.. ఉప ఎన్నిక‌కు సిద్ధం కావ‌టం.. భారీ విజ‌యం సాధించ‌టం.. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌భూమిక పోషించ‌ట‌మే కాదు.. రాజ‌కీయం మొత్తం మారిపోవ‌టానికి కార‌ణ‌మైంద‌ని చెప్పాలి.

తాజాగా చూస్తే..తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యంతో ఏడెనిమిది నెల‌ల త‌ర్వాత షురూ కావాల్సిన ఎన్నిక‌ల వేడి.. అప్పుడే మొద‌లైంది. ముంద‌స్తుపై కేసీఆర్ నిర్ణ‌యం కార‌ణంగా తెలంగాణ రాజ‌కీయాలు ఇప్పుడు ఒక్క‌సారిగా వేడెక్కాయి.

ఇదే రీతిలో ఇప్పుడు ఏపీకి సంబంధించి కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణ‌యం ఆస‌క్తిక‌రంగా మారింది. మొన్న‌టి వ‌ర‌కూ ఏపీకి వ‌చ్చేందుకు.. అక్క‌డ స‌భ పెట్టేందుకు ఆస‌క్తి చూపని రాహుల్.. ఇప్పుడు అందుకు ఓకే అన‌టమే కాదు.. ఏపీలో భారీ బ‌హిరంగ స‌భ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి వ‌చ్చేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌ని రాహుల్.. ఈ మ‌ధ్య కాలంలోకూడా ఏపీకి ఆయ‌న్ను ర‌ప్పించే ప్ర‌య‌త్నాల్ని ఆయ‌న సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్లు చెబుతారు.

విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి జ‌రిగిన న‌ష్టాన్ని ప్ర‌త్యేక హోదాతో స‌ర్దుబాటు చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న ఆయ‌న‌.. ఏపీ ప‌ర్య‌ట‌న‌కు రావాల్సింద‌న్న కాంగ్రెస్ నేత‌ల ఆహ్వానాన్ని సున్నితంగా తిర‌స్క‌రించే వార‌ని చెబుతారు. హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ఏపీకి ఇచ్చే ప్ర‌త్యేక హోదా గురించి ప‌దే ప‌దే ప్ర‌స్తావించిన ఆయ‌న ఆంధ్రోళ్ల మ‌న‌సుల్ని దోచుకునే ప్ర‌య‌త్నం చేశార‌న్న మాట వినిపించింది. అంతేకాదు.. ఏపీలో పార్టీకి విజ‌య‌వ‌కాశాలు లేవ‌నే కాదు.. నాలుగైదు ఎమ్మెల్యే సీట్లలోనూ పార్టీ గెల‌వ‌ద‌న్న అభిప్రాయాన్ని ఆయ‌న వెల్డడించారు కూడా.

ఇదిలా ఉంటే.. రాఫెల్ స్కాం మీద దేశ వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తూ.. స‌భ‌లు పెడుతున్న‌ రాహుల్ ను .. అందులో భాగంగా ఏపీకి రావాల‌ని కోరినా ఒప్పుకోలేదు. అలాంటి రాహుల్ తాజాగా మాత్రం త‌న ఏపీ ప‌ర్య‌ట‌న‌కు సై అనేశారు. సెప్టెంబ‌రు 18న ఏపీలోని క‌ర్నూలు న‌గ‌రానికి వ‌చ్చేందుకు ఆయ‌న ఓకే చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు.

ఈ స‌భ ద్వారా ఏపీ కాంగ్రెస్ కు కొంత యాక్టివ్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఇంత‌కీ రాహుల్ ప‌ర్య‌ట‌న వెనుక కార‌ణం ఏమిట‌న్న‌ది చూస్తే.. ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాలుగా తెలుస్తోంది. టీడీపీతో జ‌త క‌ట్టేందుకు కాంగ్రెస్ సిద్ధం కావ‌టం.. ఇందుకు సంబంధించిన తెర‌వెనుక ఒప్పందాలు ఒక కొలిక్కి వ‌చ్చిన నేప‌థ్యంలో ఏపీకి వ‌చ్చేందుకు రాహుల్ అంగీక‌రించిన‌ట్లుగా తెలుస్తోంది.

త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మోడీ స‌ర్కారు ఏపీకి చేసిన ద్రోహం మీదా నిప్పులు చెరుగుతార‌ని చెబుతున్నారు. అదే స‌మ‌యంలో త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినంత‌నే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌న్న మాట‌ను చెబుతారంటున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు దాదాపు ఆరేడు నెల‌ల ముందుగా ఏపీకి వ‌చ్చి.. ఆ రాష్ట్రానికి తాము చేయ‌బోయే మేలు గురించి చెప్ప‌టం ద్వారా.. బాబుతో చెట్టాప‌ట్టాల‌కు మ‌రింత వీల‌వుతుంద‌న్న ఆలోచ‌న‌తోనే ఏపీ ప‌ర్య‌ట‌న‌కు రాహుల్ ఓకే చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.


Tags:    

Similar News