రాహుల్ వేగం నడకకే పరిమితమా?

Update: 2019-02-22 17:06 GMT
పదేళ్ల తరువాత తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈసారి కాలినడకన తిరుమల వెళ్లి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సరికొత్త రికార్డు స్థాపించారు. ప్రధాన రాజకీయ నేతలెవరికీ సాధ్యం కానంత వేగంగా ఆయన ఏడుకొండలపైకి కాలినడకన చేరుకుని రికార్డు సృష్టించారు. రాహుల్ కంటే ముందు కాలినడకన తిరుమల కొండలెక్కిన ప్రధాన నేతలెవరై అంత వేగంగా చేరుకోలేకపోయారు.
   
మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్లిన రాహుల్ గాంధీ కేవలం గంటన్నరలోనే తిరుమల చేరుకున్నారు. పాపులర్ పొలిటీషియన్లలో ఆయనే అత్యంత తక్కువ సమయంలో కాలినడకన తిరుమల చేరుకున్నారట. ఏపీ సీఎం చంద్రబాబు గతంలో కాలినడకన తిరుమల కొండపైకి ఎక్కారు. అందుకు ఆయనకు పట్టిన సమయం 2 గంటలు. ఇటీవల పాదయాత్ర ముగించిన తరువాత వైసీపీ అధినేత జగన్ కూడా నడుచుకుంటూనే తిరుమల వెళ్లి వెంకన్నను దర్శించుకున్నారు. ఆయనకు మూడున్నర గంటలు పట్టింది.
   
ఇక అంతకు కొద్ది రోజుల ముందు జనసేన అధినేత పవన్ కూడా కాలినడకన తిరుమల వెళ్లారు. ఆయనకు కూడా మూడున్నర గంటలకు పైనే సమయం పట్టింది. పవన్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన కొత్తలో నడకమార్గంలో తిరుమలకు వెళ్లారు. ఆయనది కూడా రికార్డు సమయమే... ఏకంగా ఏడున్నర గంటల సమయం పట్టింది ఆయనకు.
   
ఈ రికార్డుల సంగతి పక్కన పెడితే రాహుల్ తిరుమల కొండలనెక్కడంలో చూపించిన వేగం మోదీ వెనుక పరుగులు తీయడంలో చూపించలేకపోతున్నారన్న నిరాశాపూరిత మాటలు కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. మోదీ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉందని అంతా అనుకుంటున్నా దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాహుల్ వెనుకబడుతున్నారు. మోదీపట్ల ప్రజల్లో మాత్రం సానుకూలత ఇంకా పోలేదని తాజా సర్వేలు కూడా చెబుతున్నాయి. ప్రధానిగా ఈసారి ఎవరిని కోరుకుంటారని సర్వే సంస్థలు ప్రజలను అడిగినప్పుడు అత్యధికులు మోదీ పేరే చెబుతున్నారు. రాహుల్ ఈ విషయంలో రెండో స్థానంలో ఉంటున్నాకూడా మోదీ దరిదాపుల్లో నిలవలేకపోతున్నారు.

Tags:    

Similar News