రాష్ట్ర విభజనలో తప్పు చేయలేదట

Update: 2015-07-27 11:32 GMT
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పుడు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ విభజనలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి తప్పు చేయలేదట. ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదట. ఇతర పార్టీల మీద ఎదురు దాడి చేస్తూ నవ్యాంధ్రలో ఎదుగుదామని.. మీరంతా మీ మీ నోటికి పదును పెట్టాలని పార్టీ నాయకులకు ఆయన సూచించారట.

ఎంత గొప్ప వ్యూహం.. ఎంత గొప్ప వ్యూహం.. మిగిలిన పార్టీలు కూడా లేఖలు ఇచ్చాయని, ఆ తర్వాతే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్న విషయం ప్రజలకు తెలియనిదా? ఎన్నికల ముందు హడావుడిగా నిర్ణయం తీసుకోవాలని మిగిలిన పార్టీలు లేఖలు ఇచ్చాయా? ఐదు దశాబ్దాలుగా అభివృద్ధి చేసిన హైదరాబాద్ ను ఏకపక్షంగా కట్టబెట్టాలని మిగిలిన పార్టీలు లేఖలు ఇచ్చాయా? ఆంధ్రప్రదేశ్ కు రాజధానిని లేకుండా చేసి.. రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక రాష్ట్ర రాజధానిని మరొక రాష్టంలో పెట్టాలని మిగిలిన పార్టీలు సూచించాయా? పార్లమెంటు తలుపులు మూసి సీమాంధ్ర ఎంపీలను పార్టీ మార్షల్ ఎంపీలతో కొట్టించి ఏకపక్షంగా విభజన బిల్లును ఆమోదించాలని మిగిలిన పార్టీలు సూచించాయా? ఉమ్మడి ఏపీకి సంబంధించిన అన్ని ఉన్నత విద్యా, వైద్య సంస్థలు హైదరాబాద్లో ఉంటే.. వాటి విలువ ఇప్పుడు వేల కోట్ల రూపాయలకు ఎగబాకితే.. వాటన్నిటినీ నవ్యాంధ్ర వదిలేసుకోవాలని, అప్పనంగా తెలంగాణకు కట్టబెట్టాలని మిగిలిన పార్టీలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని దఖలు పరిచాయా? ఉదాహరణకు ఒక్క ఎన్జీ రంగా వర్సిటీ విలువ రూ.30 వేల కోట్లు. దానిలో ఏపీ వాటా చూసుకుంటే దాదాపు రూ.15 వేల కోట్లు రావాలి. కానీ, ఆ మొత్తం వర్సిటీని అభివృద్ధి చేసి ఇప్పుడు ఉత్త చేతులతో వెళ్లిపోవాలని మిగిలిన పార్టీలు లేఖలు ఇచ్చాయా? ఒక్కసారి ప్రశ్నిస్తే ఇటువంటి ప్రశ్నలు లక్ష ఉన్నాయని.. కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం అంతా ఇంతా కాదని, ఇప్పుడు ఎదురు దాడి చేసినంత మాత్రాన ప్రజలు చేసిన, జరిగిన ఘోరాలను మర్చిపోతారా అని టీడీపీ, వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు రాష్ట్ర విభజనకు అనుకూలంగా తాము లేఖే ఇవ్వలేదని వైసీపీ స్పష్టం చేస్తోంది.

ప్రత్యేక హోదా, పోలవరంపై పోరాడడం లేదని రాహుల్ అంటున్నారని, దీనికి సంబంధించి కూడా తప్పు కాంగ్రెస్ దేనని స్పష్టం చేస్తున్నారు. అసలు ప్రత్యేక హోదా అంశాన్ని విభజన బిల్లులో పెట్టకపోవడం వల్లే ఇప్పుడు ఇంత గందరగోళం జరుగుతోందని, అప్పుడే విభజన బిల్లులో పెట్టి ఉంటే ఈ గందరగోళం జరిగేది కాదని తేల్చి చెబుతున్నారు. ఇక పోలవరం విషయంలోనూ గాలికి వదిలేసినా బీజేపీ చొరవ తీసుకుందని వివరిస్తున్నారు. ఇప్పటికీ రాహుల్ చాక్లెట్ బాయ్ లాగే మాట్లాడాడని ఎద్దేవా చేస్తున్నారు.
Tags:    

Similar News