ఏపీ ప్రజలకు రాహుల్‌ గాంధీ ఉద్వేగభరిత లేఖ!

Update: 2022-10-21 10:34 GMT
కాంగ్రెస్‌ పార్టీని తిరిగి దేశంలో అధికారంలో తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలయిన ఈ యాత్ర ఆ రాష్ట్రంతోపాటు కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో పూర్తయింది. అయితే ఏపీలో కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా మాత్రమే రాహుల్‌ యాత్ర జరిగింది.

ఈ యాత్రలో ఏపీ కాంగ్రెస్‌ నేతలు శైలజానాథ్, జేడీ శీలం, కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుంచి రాహుల్‌ యాత్రకు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగ లేఖ రాశారు. ఇందులో ఏపీలో తన యాత్రను దిగ్విజయంగా సాగేలా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీలో యాత్ర సందర్భంగా ప్రజలను ప్రభావితం చేస్తున్న పలు సమస్యలను తెలుసుకున్నానన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా అమరావతి రాజధానికే కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని ఆ లేఖలో రాహుల్‌ తేల్చిచెప్పారు. అలాగే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ప్రభుత్వ రంగ హోదాను కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. ఏపీలో పంచాయతీరాజ్‌ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని రాహుల్‌ విమర్శించారు.

రాహుల్‌ గాంధీ లేఖలో మరిన్ని అంశాలు ఇలా ఉన్నాయి.." గత మూడు రోజులుగా రైతులు, యువత, మహిళలు, కార్మికులతో మాట్లాడా. 2014లో పార్లమెంటులో ఏపీ ప్రజలకు చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తున్నా. ఇవి ఒక వ్యక్తి లేదా ఒక పార్టీ చేసిన హామీలు కాదు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పార్లమెంటు చేసినవి. ఈ హామీలు పూర్తిగా అమలు చేయాల్సిన బాధ్యత పాలకులదే. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ గతంలో కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉంది. ఆంధ్ర ప్రజల హృదయాల్లో కాంగ్రెస్‌ తన పూర్వస్థానానికి చేరుకోవడానికి చేయగలిగినదంతా చేయాలని నిర్ణయించుకున్నా" అని రాహుల్‌ తన లేఖలో పేర్కొన్నారు.

అదేవిధంగా... "ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి, దేశ ప్రజలకు ఎదురవుతున్న సవాళ్లను తెలుసుకోవడానికి భారత్‌ జోడో యాత్ర నాకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. కులమతాలు, వేషభాషలు, ఆహారం తదితరాల ఆధారంగా భారతీయుల మధ్య విభేదాలు పెట్టే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. దేశంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిరుద్యోగం కారణంగా ఆర్థిక అసమానతలు ఏర్పడుతున్నాయి. రాజకీయ, ఆర్థిక అధికారం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతోంది. ఇవన్నీ తీవ్ర ఆందోళన కలిగించే అంశాలు" అంటూ రాహుల్‌ గాంధీ లేఖలో పేర్కొన్నారు.

కాగా... రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో నాలుగు రోజుల పాటు సాగిన రాహుల్‌ గాంధీ జోడో పాదయాత్ర అక్టోబర్‌ 21 శుక్రవారంతో ముగిసింది. రాహుల్‌ యాత్ర కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా కర్ణాటక సరిహద్దు మాధవరం బ్రిడ్జి వద్ద రాహుల్‌ గాంధీకి కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఘన స్వాగతం పలికారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News