రాహుల్ యూట‌ర్న్‌!..పెరారివ‌ళ‌న్ బ‌య‌ట‌కొస్తాడా?

Update: 2018-07-12 08:40 GMT
భార‌త మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ హ‌త్య కేసులో ఉరిశిక్ష‌కు గురైన నిందితుల్లో పెరారివ‌ళ‌న్ ఒక‌రు. రాజీవ్‌ ను హ‌త్య చేసేందుకు ఎల్టీటీఈ ఉగ్ర‌వాదులు వినియోగించిన మాన‌వ బాంబు త‌యారీకి కీల‌క‌మైన ప‌రిక‌రాలు  అందించాడ‌నే అభియోగంతో పెరారివ‌ళ‌న్ అరెస్ట్  కాగా... నాటి పెరంబుదూరు ఘ‌ట‌న‌లో ప్ర‌త్య‌క్షంగా పాలుపంచుకున్న నిందితుల‌తో పాటు అత‌డికి కూడా కోర్టు ఉరిశిక్ష‌ను ఖ‌రారు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ త‌ర్వాత జ‌రిగిన వ‌రుస ప‌రిణామాల నేప‌థ్యంలో ఉరిశిక్ష ప‌డిన ఖైదీలందిరితో పాటు పెరారికి కూడా యావ‌జ్జీవ శిక్షే ఖ‌రారైంది. అయితే ఈ కేసులో విచార‌ణ సుదీర్ఘంగా జ‌రిగిన నేప‌థ్యంలో గ‌డ‌చిన 27 ఏళ్లుగా పెరారివ‌ళ‌న్‌ తో పాటుగా ఇత‌ర నిందితులంతా జైలులోనే ఉండిపోయారు. మాజీ ప్ర‌ధాని స్థాయి వ్య‌క్తినే పొట్ట‌న‌బెట్టుకున్న నిందితుల‌ను ఎలా బ‌య‌ట‌కు వ‌దులుతారంటూ ఎప్ప‌టిక‌ప్పుడు వినిపిస్తున్న ప్ర‌శ్న‌ల నేప‌థ్యంలో నిందితులు కోర్టులో  వేసుకుంటున్న పిటిష‌న్లకు ఎక్క‌డిక‌క్క‌డ ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఈ క్ర‌మంలో  అస‌లు రాజీవ్  హ‌త్య ఘ‌ట‌న‌కు సంబంధించి ప్ర‌త్య‌క్ష పాత్ర లేని పెరారివ‌ళ‌న్  అమాయ‌కుడ‌ని - ఈ కార‌ణంగా  ద‌యాగుణంతో అత‌డిని విడుద‌ల చేయాల‌ని త‌మిళ  సంఘాల‌తో  పాటు అత‌డి త‌ల్లి  అర్బుతమ్మాళ్ అలుపెర‌గ‌ని పోరాట‌మే చేస్తోంది. ఎక్క‌డికెళ్లినా ఎదురు దెబ్బ‌లే  త‌గులుతున్నా కూడా కుమారుడిని విడిపించుకునే విష‌యంలో ఆమె త‌న పోరాటాన్ని మాత్రం ఆప‌డం  లేదు. త‌మిళ సంఘాల నేత‌ల‌తో పాటు క‌నిపించిన ప్ర‌తి  నేత‌నూ ఆమె క‌లుస్తున్నారు. త‌న కుమారుడు ఆమాయ‌కుడని - అన‌వ‌స‌రంగా శిక్ష ప‌డింద‌ని - నిర్దోషి అయిన త‌న కుమారుడిని విడిపించేందుకు స‌హ‌క‌రించాల‌ని ఆమె విజ్ఞ‌ప్తి చేస్తూనే ఉన్నారు.

అయితే నిందితుల చేతిలో హ‌త్య‌కు గురైన రాజీవ్ త‌న‌యుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఈ  వ్వ‌వ‌హారంలో చాలా భిన్న  వైఖ‌రి తీసుకున్నారన్న‌వాద‌న వినిపిస్తోంది. మాజీ ప్ర‌ధాని స్థాయి వ్య‌క్తిని పొట్ట‌న‌బెట్టుకున్న నిందితుల‌ను వ‌దిలివేస్తారా? అంటూ గ‌తంలో ఆయ‌న పెరారివ‌ళ‌న్ పిటిష‌న్‌ పై భ‌గ్గుమ‌న్నారు. అంతేకాకుండా నిందితుల‌కు క‌ఠిన శిక్ష‌లు అమ‌లు  చేయాల్సిందేన‌న్న వాద‌ననూ ఆయ‌న  వినిపించిన వైనం  మన‌కు తెలిసిందే.  ఇదంతా కాంగ్రెస్ పార్టీ  అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క  ముందు రాహుల్ తీసుకున్న నిర్ణ‌యంగా చెప్పాలి. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు  తీసుకున్న త‌ర్వాత రాహుల్  ఈ వ్య‌వ‌హారంలో త‌న వైఖ‌రిని  పూర్తిగా మార్చుకున్నార‌ని చెప్ప‌క తప్ప‌దు. ఈ మేర‌కు నిన్న త‌న‌ను క‌లిసిన  ప్రముఖ తమిళ దర్శకులు పా రంజిత్ ముందు  రాహుల్ ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పెరారివ‌ళ‌న్ విడుద‌ల‌కు త‌న‌కు గానీ - త‌న కుటుంబ స‌భ్యుల‌కు గానీ ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని రాహుల్ వ్యాఖ్యానించారు. పెరారివ‌ళ‌న్ విడుద‌ల  కోసం  చాన్నాళ్ల నుంచి రాయ‌బారం న‌డుపుతున్న రంజిత్‌... రాహుల్  తాజా స్పంద‌న‌తో  హ‌ర్షం వ్య‌క్తం చేశారు. నిన్న‌టి భేటీలో రాహుల్‌ తో సుమారు రెండుగంటలపాటూ తమిళనాడు రాజకీయాలను మాట్లాడుకున్న సమయంలోనే పేరరివాళన్‌ విడుదలకు సహకరించాల్సిందిగా రంజిత్‌ కోరారు. పేరరివాళన్‌ విడుదల విషయంలో త‌న‌తో  పాటు త‌న‌ కుటుంబ సభ్యులకు ఎలాంటి అభ్యంతరం లేదని  స్వ‌యంగా రాహుల్ వ్యాఖ్యానించార‌ట‌.  రంజిత్‌ తో కలిసి రాజకీయాలు మాట్లాడుకున్నామ‌ని చెప్పిన రాహుల్‌ గాంధీ...  స‌ద‌రు ట్వీట్ లో ఫొటో కూడా పెట్ట‌డంతో  చేయడంతోపాటు ఫొటో పెట్టారు.

మొత్తంగా రాహుల్ యూటర్న్ వైఖ‌రితో పెరారివ‌ళ‌న్ విడుద‌ల‌కు రంగం సిద్ధ‌మైన‌ట్టేన‌న్న వాద‌న వినిపిస్తోంది. పెరారివ‌ళ‌న్ విడుద‌ల‌కు సంబంధించి ఇదివ‌ర‌కే త‌మిళ‌నాడు దివంగ‌త  సీఎం జ‌య‌ల‌లిత చాలా అడుగులే వేశారు. అయితే చ‌ట్టంలోని కొన్ని అంశాలు ఆమె య‌త్నాల‌ను విఫ‌లం చేసిన వైనం మ‌న‌కు తెలిసిందే. జ‌య  చ‌ర్య‌ల‌పై నాడు ఆగ్ర‌హం వ్య‌క్తం  చేసిన రాహుల్‌... ఇప్పుడు ఇదే విష‌యంపై సానుకూల‌త వ్య‌క్తం చేసిన దరిమిలా... పెరారివ‌ళ‌న్ విడుద‌ల‌కు రంగం సిద్ధ‌మైన‌ట్టేన‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అయినా... కొంత‌కాలం క్రితం పెరారి  విష‌యంలో  చాలా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించిన రాహుల్‌... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మారిన త‌ర్వాత ఎందుకు మ‌న‌సు మార్చుకున్నార‌న్న కోణంలో కొంద‌రు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు  చేస్తున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందుగా రాహుల్ తీసుకున్న యూట‌ర్న్ పెద్ద రాజ‌కీయ చ‌ర్చ‌కే తెర తీయ‌నుంద‌న్న  కోణంలో ఆస‌క్తిక‌ర వాద‌న‌లు వినిపిస్తున్నాయి. బీజేపీ కూడా రాహుల్ వైఖ‌రిపై త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేయ‌డం కూడా ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. మొత్తంగా పెరారివ‌ళ‌న్ విడుద‌ల విష‌యం ఇప్పుడు రాజ‌కీయ రంగు పులుముకోక త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది.

Tags:    

Similar News