నీలినీడల పొత్తు నిలుస్తుందా..!?

Update: 2018-09-15 05:10 GMT
ఆలూ లేదు...చూలు లేదు...అప్పుడే పొత్తులపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఒకే ఒక్క సమావేశం పెట్టి మహా కూటమి ఏర్పాటుకు అంగీకరించిన పార్టీల్లో ముసలం పుట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఈ అనుమానాలను కలిగిస్తున్నాయి. ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని...ముఖ్యంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును గద్గె దించడమే లక్ష్యంగా పొత్తులు కుదుర్చుకోవాలని భావిస్తున్నారు.అయితే తెలంగాణలో తమ పార్టీ బలంగా ఉన్న చోట.... తమ  అభ్యర్ధులు తప్పక గెలుస్తారు అని భావించిన చోట మాత్రం ఆ స్ధానాలను పొత్తులో భాగంగా వదులుకోకండి అంటూ రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. ఇది ఎలా సాధ్యమని ఇతర పార్టీల నాయకులు ఇప్పటికే పెదవి విరుస్తున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తూనే ఉందని - ఓటమి పాలైన నియోజకవర్గాలను ఎలా విడదీస్తామని ఆ నాయకులు అంటున్నారు. ఇలాంటి నిబంధనల కారణంగా ఇతర రాజకీయ పార్టీల తమతో కలిసే అవకాశం తక్కువేనని కాంగ్రెస్  నాయకులు అంటున్నారు.

అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో నాయకులందరూ తమ స్ధానాల్లో విజయం సాధిస్తామని ఎంతో నమ్మకంగా ఉన్నారు. అధికార పార్టీపై వారి వారి నియోజకవర్గాల్లో అసంత్రప్తి ఉందన్నది ఆ నాయకులు విశ్వాసం. ఇలాంటప్పుడు ఏ నాయకుడి నియోజకవర్గాన్ని పొత్తుకు వదిలేస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉందని - అలాంటి నియోజకవర్గాలను వదులుకునేందుకు వారు ఎలా అంగీకరిస్తారనే ప్రశ్న వస్తోంది. మరోవైపు వామపక్షాలకు కూడా నల్లగొండ - ఖమ్మం జిల్లాల్లో మంచి పట్టు ఉంది. వారికి పట్టు ఉన్న నియోజకవర్గాలను వారెలా వదులుకుంటారని అంటున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే పొత్తు చర్చలు ప్రారంభం కాక ముందే కాంగ్రెస్ పార్టీకి చిక్కులు తప్పవా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందరి లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించడమే అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ సీట్ల త్యాగాన్ని మాత్రం ఇతర పార్టీలు చేయాలనడం ఎంత వరకూ సమంజమని ఇతర పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి పార్టీ తమకు పదుల సంఖ్యలో సీట్లు కావాలని పట్టు పడితే కాంగ్రెస్ పార్టీ ఏ స్ధానాలు వదులుకుంటుందన్నది పెద్ద ప్రశ్న అని రాజకీయ పండితులు చెబుతున్నారు.


Tags:    

Similar News