కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో వివాదానికి తెర తీశారు. ఇంకా చెప్పాలంటే..తనపై తానే డౌట్లు పుట్టించుకున్నారు! ఓట్ల రాజకీయంలో భాగంగా రాహుల్ చేసిన పని ఆయన మతంపై సందేహాలు కలిగేలా చేసింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రాహుల్ గాంధీ సోమ్ నాథ్ ఆలయాన్ని సందర్శించారు. అయితే అక్కడ హిందువులు కాని వారు మాత్రమే అక్కడున్న రిజిస్టర్‌లో తమ వివరాలు రాస్తారు. కానీ రాహుల్ మాత్రం ఆలయ పరిసరాల్లోకి వెళ్లిన తర్వాత లోపలికి వెళ్లడానికి అక్కడి ఆలయ పాలకమండలి సభ్యులను ప్రత్యేకంగా అనుమతి కోరారు. రిజిస్టర్ లో ఎంట్రీ చేశారు. దీంతో తాను హిందువు కాదా అన్న కొత్త అనుమానాలకు రాహుల్ తెరలేపినట్లయింది.
గుజరాత్ లో హిందువుల ఓట్లను రాబట్టుకునేందుకు ఇటీవలి కాలంలో రాహుల్ హిందూ దేవాలయాన్ని సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే రీతిలో సోమ్ నాథ్ ఆలయాన్ని సందర్శించిన రాహుల్ తన వివరాలను హిందూయేతర వక్తుల లాగే లిస్ట్ లో ఎంట్రీ చేశారు. రిజిస్టర్ లో రాహుల్ గాంధీ మీడియా కోఆర్డినేటర్ వివరాలను రాశారు. రాహుల్ గాంధీతోపాటు ఆయన వెంట గుడిని సందర్శించిన అహ్మద్ పటేల్ వివరాలను కూడా ఆయన రిజిస్టర్ లో పొందుపరిచారు. దీంతో ఈ చర్య కొత్త సందేహాలకు దారితీసింది. అయితే కాంగ్రెస్ మాత్రం ఇది బీజేపీ కుట్ర అంటూ విమర్శిస్తోంది. రిజిస్టర్ లో రాహుల్ గాంధీ జీ అని సంతకం చేశారని - ఆయన జీ అంటూ ఎందుకు సంతకం చేస్తారని కాంగ్రెస్ నేత దీపేంద్ర హుడా ప్రశ్నిస్తున్నారు.
కాగా, రెండు రోజుల సోమ్ నాథ్ పర్యటనలో భాగంగా రాహుల్.. గిర్ సోమ్ నాథ్ - అమ్రేలీ - భావనగర్ జిల్లాల్లో తిరిగి పలు సభల్లో పాల్గొననున్నారు. అక్టోబర్ 24న ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత రాహుల్ గుజరాత్ పర్యటనకు రావడం ఇది ఆరోసారి. అయితే ఎన్నికల ప్రచారంతో పాటుగా హిందుత్వ వివాదంలో కూడా రాహుల్ పడ్డారని అంటున్నారు.