ప్రత్యేకం గురించి మాట్లాడవే రాహుల్

Update: 2015-07-14 03:19 GMT
ఏపీలో ఏదో జరిగిపోతుందని.. రైతులకు దారుణమైన మోసం జరిగిందంటూ గుండెలు బాదుకుంటూ ఢిల్లీ నుంచి పరుగులు పెడుతూ ఏపీకి వచ్చేయాలని తెగ ఉబలాటపడిపోతున్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రైతుల సమస్యలపై మాట్లాడేందుకు.. వారికి అండగా ఉంటామన్న భావన కలిగించేందుకు ఆయన పలు రాష్ట్రాల్లో పాదయాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మిగిలిన రాష్ట్రాల మాదిరి ఆంధ్రప్రదేశ్ అన్న విషయాన్ని యువరాజు మర్చిపోయినట్లున్నారు. ఏపీలో అడుగుపెట్టాలని అనుకునే ముందు.. మొదట విభజన కారణంగా ఏపీకి చేసిన అన్యాయం మీద.. ఏపీ ప్రజలకు చేసిన ద్రోహం మీద చెంపలేసుకోవాల్సిన అవసరం ఉంది.

రైతుల సమస్యల గురించి మాట్లాడతానని.. వారికి అండగా ఉంటానని చెప్పే రాహుల్.. అంతకు మించి ఐదు కోట్ల ఆంధ్రులకు అండగా ఎందుకు నిలవటం లేదు? విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తుందన్న భావన ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పించే విషయంలో మోడీ సర్కారుపై ఎందుకు పోరాటం చేయటం లేదు.

ఏపీలో రైతుల సమస్యల కంటే కూడా ఏపీ ప్రజల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. కొద్ది మంది రైతులకు మనోధైర్యం ఇచ్చేందుకు పాదయాత్ర చేస్తానని చెబుతున్న రాహుల్.. విభజన కారణంగా మొత్తంగా నష్టపోయిన ఏపీ ప్రజలకు మనోధైర్యం ఇచ్చేందుకు గడిచిన 13 నెలల్లో రాహుల్ ఏం చేస్తున్నట్లు..? ఇలాంటి విషయాల మీద పెదవి విప్పకుండా.. మిగిలిన రాష్ట్రాల మాదిరి ఏపీకి వచ్చేసి బర.. బర మంటూ వచ్చేసి.. చకచకా ఓ పదో.. పాతికో కిలోమీటర్లు నడిచేసి.. నాలుగు మాటలు చెప్పేసి విమానం ఎక్కేస్తామంటే కుదరదంటే కుదరదు.

ఏపీ రైతుల గురించి మాట్లాడటానికి ముందు.. ఏపీ ప్రజలకు జరిగిన అన్యాయం.. దానిపై ఏపీ కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలు.. రాహుల్ స్థాయిలో ఏం జరిగిందన్న విషయాన్ని చెప్పకుండా ఉత్సవ విగ్రహం మాదిరి ఉంటానంటే ఆంధ్రోడు ఒప్పుకోడన్న విషయం రాహుల్ కు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News