రాహుల్ నాయకత్వానికి సవాలు

Update: 2015-07-31 12:23 GMT
కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వానికి అసలైన సవాలు ఎదురైంది. ఆయన తన నాయకత్వ పటిమను నిరూపించుకునే సమయమూ ఆసన్నమైంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. బీహార్ కు కూడా తాము ప్రత్యేక హోదా ఇవ్వలేదని, దానికి ప్యాకేజీ మాత్రమే ఇవ్వనున్నామని, అందువల్ల, ఆంధ్రప్రదేశ్ కు కూడా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, అసలు ఇవ్వడమే అసాధ్యమని సాక్షాత్తూ లోక్ సభలో హోం శాఖ సహాయ మంత్రి ఇంద్రజిత్ సింగ్ తేల్చి చెప్పారు. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా లేదని తేలిపోయింది.

నిన్న కాక మొన్న అనంతపురం జిల్లాలో పర్యటించిన రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాపై ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధనకు ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. చంద్రబాబు కానీ జగన్ కానీ ప్రత్యేక హోదాపై పోరాడడం లేదని, వాళ్లు మోదీ ఒత్తిడికి లొంగిపోయారని విమర్శించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే రాహుల్ గాంధీ చేతికి అద్భుతమైన అస్త్రం ఇచ్చింది. కేంద్రం మెడలు వంచడమే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ లో కోల్పోయిన పట్టును సాధించుకోవడానికి కాంగ్రెస్ కు అద్భుతమైన అవకాశం వచ్చింది. రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఆందోళనలను ఉద్ధృతం చేసి, కేంద్ర ప్రభుత్వ మెడలు వంచితే రాహుల్ గాంధీ సత్తా దేశ ప్రజలకు తెలుస్తుంది. లోక్ సభలో అసాధ్యమన్న దానిని ఇప్పించారని ఏపీ ప్రజలు కాంగ్రెస్ గురించి పునరాలోచించే అవకాశం ఉంటుంది.

అటు రాహుల్ గాంధీకి, ఇటు ఏపీ కాంగ్రెస్ నేతలకు ఇది సువర్ణావకాశం. మరి దానిని సద్వినియోగం చేసుకుంటారో నేలపాలు చేసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News