అమ్మను.. అబ్బాయిని సీమాంధ్రులు నిలదీయాల్సిందేనా?

Update: 2015-06-12 04:20 GMT
ఈ మధ్య దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పరిమిత దూరం పాదయాత్రను చేపడుతూ తరిగిపోయిన పార్టీ పరపతిని పెంచేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ మధ్యన అదిలాబాద్‌ జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఏపీలో కూడా పాదయాత్ర చేయాలని రాహుల్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పీసీసీ చీఫ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గాన్ని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్ర సందర్భంగా సుమారు పది గ్రామాలు కవర్‌ అయ్యేలా మొత్తం 15 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని రాహుల్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తన పాదయాత్ర సందర్భంగా ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల్ని పరామర్శించటంతో పాటు.. వలస వెళుతున్న రైతుకూలీల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు. మరోవైపు జులైలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోస్తా జిల్లాల్లో పర్యటించనున్నట్లు కాంగ్రెస్‌ నేతలు వెల్లడించారు.

రాష్ట్ర విభజన సమయంలో అత్యంత పక్షపాతంగా వ్యవహరించి.. సీమాంధ్రులను దారుణంగా మోసం చేసిన సోనియా.. రాహుల్‌గాంధీలు సీమాంధ్రకు వస్తున్న నేపథ్యంలో.. వారిని నిలదీయాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. విభజన సందర్భంగా సీమాంధ్రకు న్యాయం జరిగే ఏ ఒక్క అంశాన్ని పట్టించుకోని సోనియా.. రాహుల్‌లు ఇప్పుడు రావటం ఏమిటని ఆగ్రహం వ్యక్తమవుతోంది.

విభజన సమయంలో తాము అనుసరించిన విధానాల వల్ల.. విభజన తర్వాత కూడా సీమాంధ్రులు దారుణమైన మాటల్ని పడాల్సి రావటమే కాదు.. పేద రాష్ట్రంగా.. ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రంగా..నిత్యం కేంద్ర సాయం కోసం ఎదురుచూసే దుస్థితికి దిగజార్చిన దుస్థితికి కారణం అమ్మా.. కొడుకులే. సీమాంధ్రకు న్యాయం చేసే విషయంలో ఇప్పటికి పార్లమెంటులో గళం విప్పని సోనియా.. రాహుల్‌ ఏ ముఖం పెట్టుకొని సీమాంధ్రలో పర్యటిస్తారు? వారికి.. ఆ హక్కు ఉందా..? అన్న ప్రశ్నలు సీమాంధ్రులు ఆగ్రహంగా సంధిస్తున్నారు.


Tags:    

Similar News