రాహుల్ కు ఘోర ప్ర‌మాదం..జ‌స్ట్ మిస్!

Update: 2018-08-31 11:13 GMT
2009లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వ‌రుస‌గా రెండో సారి సీఎంగా ఎన్నికైన దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హెలికాప్ట‌ర్ కూలిన ప్ర‌మాదంలో హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. సాంకేతిక లోపాలున్న హెలికాప్ట‌ర్ ను వినియోగించ‌డం వ‌ల్లే ఆ మ‌హానేత చ‌నిపోయిన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఆ త‌ర్వాత కూడా కొంత‌మంది విమానాలు, హెలికాప్ట‌ర్ ల‌లో సాంకేతిక లోపాల వ‌ల్ల అశువులు బాశారు. అయితే, తాజాగా ఈ ఏడాది కూడా సాంకేతిక లోపం వ‌ల్ల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పెను ప్ర‌మాదం త‌ప్పింద‌న్న వార్త క‌ల‌క‌లం రేపుతోంది. ఓ 20 సెక‌న్లు ఆలస్యంగా ఆయ‌న విమానం ల్యాండ్ అయి ఉంటే ఘోర ప్ర‌మాదం జ‌రిగి ఉండేద‌ని ఓ క‌థ‌నం జాతీయ మీడియాలో వెలువ‌డింది. ఈ ఏడాది ఏప్రిల్ లో జ‌రిగిన ఆ ఘ‌ట‌న తాలూకు వివ‌రాల‌ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)తాజాగా వెల్ల‌డించ‌డం సంచ‌ల‌నం రేపుతోంది.

ఈ ఏడాది కర్ణాటక శాసన సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2018 ఏప్రిల్ 26న ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ హుబ్బళికి ప్రత్యేక విమానంలో బ‌య‌లుదేరారు. అయితే, ఆ విమానంలో సాంకేతిక లోపం ఏర్ప‌డ‌డంతో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వ‌చ్చింది. చిన్న సాంకేతిక లోపం కారణంగానే విమానం అత్యవసరంగా ల్యాండ్ చేశామ‌ని అప్పట్లో DGCA వివరణ ఇచ్చింది. అయితే, ఈ వ్య‌వ‌హారంపై కర్ణాటక డీజీపీ నీలమణి రాజుకు కాంగ్రెస్ నేత‌లు ఫిర్యాదు చేశారు. జాతీయ‌స్థాయి నేత‌లు ప్ర‌యాణిస్తోన్న ఆ విమానం భ‌ద్ర‌త విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హించ‌డంపై వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే, విమానంలో ఆటో ఫైలెట్ సిస్టం సవ్యంగా పని చెయ్యకపోవడం వల్ల‌ సాంకేతిక లోపం ఏర్ప‌డింద‌ని, అందుకే ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ కు ఆదేశించామ‌ని DGCA తాజాగా వివరణ ఇచ్చింది. ఈ తాజా ప్ర‌క‌ట‌న‌తో  DGCAపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.


Tags:    

Similar News