పిలిచి మ‌రీ యువ‌రాజుకు అవ‌మానం?

Update: 2018-01-27 04:41 GMT
నోరు తెరిస్తే నీతులు. అస‌లెలా ఉండాలో నేర్చుకోవాల‌న్న‌ట్లుగా మాట‌లు చెప్పే ప్ర‌ధాని మోడీలో క‌నిపించే రెండు ర‌కాల ధోర‌ణులు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. ప‌వ‌ర్ లో ఉన్న‌ప్పుడు ఏం చేసినా న‌డిచిపోతుంది. ఆ ధీమా కొంత‌వ‌ర‌కూ బానే ఉంటుంది. అధికారం చేతిలో ఉన్న‌ప్పుడు చేసే త‌ప్పులే.. త‌ర్వాత ఆ ప‌వ‌ర్ చేజారిపోవ‌టానికి కార‌ణంగా మారుతుంది.

పాల‌న ఎలా ఉన్నా.. ఎక్క‌డా అహంకారం అన్న‌ది క‌నిపించ‌కూడ‌దు. అదెంత ఎక్కువ‌గా క‌నిపిస్తే.. అంత త్వ‌ర‌గా ప్ర‌జా వ్య‌తిరేక‌త పెరుగుతుంటుంది. మాట‌ల్లో ఉన్న‌తంగా క‌నిపిస్తూనే.. చేత‌ల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించే తీరుతో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతుంటాయి. గ‌ణతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని అవ‌మానించారంటూ వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు ఈ కోవ‌కు చెందిన‌వే.

ప్ర‌జాస్వామ్యంలో అధికార ప‌క్షానికి ఎంత ప్రాధాన్య‌త ఉంటుందో.. విప‌క్షానికి అంతే ప్రాధాన్య‌త ఉంటుంది. విప‌క్షం లేని అధికార‌ప‌క్షం ప్ర‌జాస్వామ్యానికే ప్ర‌మాద‌మ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. విప‌క్ష పార్టీ అధినేత‌ను గ‌ణ‌తంత్ర వేడుకుల సంద‌ర్భంగా మొద‌టివ‌రుస‌లో కేటాయించ‌కుండా ఆరో వ‌రుస‌లో సీటు కేటాయించిన వైనం మోడీ స‌ర్కారుపై కొత్త విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇచ్చేలా చేసింది.

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడి హోదాలో రాహుల్ ను ముందు వ‌రుస‌లో కూర్చోబెట్ట‌కుండా ఆరో వ‌రుస‌లో సీటు కేటాయించ‌టంపై కాంగ్రెస్ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త ఏడాది గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో కాంగ్రెస్ అధ్య‌క్ష స్థానంలో ఉన్న సోనియాను మొద‌టివ‌రుస‌లో సీటు కేటాయించిన కేంద్రం.. తాజా రిప‌బ్లిక్ డే ఉత్స‌వాల సంద‌ర్భంగా మాత్రం అందుకు భిన్నంగా ఆరో వ‌రుస‌లో సీటు కేటాయించారు.

మోడీ నేతృత్వంలోని స‌ర్కారు చౌక‌బారు రాజ‌కీయాల్ని ప్ర‌ద‌ర్శిస్తుందంటూ కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ వ్య‌వ‌హారంపై రాహుల్ పెదవి విప్ప‌కుండా హుందాగా వ్య‌వ‌హ‌రించారు. త‌న‌కు కేటాయించిన సీటు ఏ వ‌రుస‌లో ఉంద‌న్న విష‌యాన్ని ఆయ‌న ప‌ట్టించుకోన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు.  అదే విష‌యాన్ని ఓ మీడియా సంస్థ‌తోనూ చెప్పారు.

కేంద్రం తీరును త‌ప్పుప‌ట్ట‌కుండా.. ఆరో వ‌రుస‌లో త‌న‌కు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆయ‌న ప‌క్క‌న రాజ్య‌స‌భ‌లో విప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గులాంన‌బీ అజాద్ కూర్చున్నారు. గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో త‌మ యువ‌రాజుకు జ‌రిగిన అవ‌మానంపై కాంగ్రెస్ నేత‌లు ఉడికిపోతుంటే.. ఆ పార్టీ అభిమానులు అంతేలా ర‌గిలిపోతున్నారు.

సాధార‌ణంగా ప్ర‌తిప‌క్ష పార్టీ అధినేత‌కు మొద‌టివ‌రుస‌లో సీటు కేటాయిస్తుంటారు. మొద‌ట నాలుగో వ‌రుస‌లో అని చెప్పిన‌ప్ప‌టికీ.. ఆరో వ‌రుస‌లో రాహుల్‌ కు సీటు కేటాయించారు. గ‌ణ‌తంత్ర వేడుకుల‌కు వ‌చ్చే అతిథులు.. కేంద్ర‌మంత్రులు.. సీనియ‌ర్ బీజేపీ నేత‌ల‌కు దూరంగా.. ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే ఆరో వ‌రుస‌లో రాహుల్ కూర్చున్నారు. అదే స‌మ‌యంలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాకు మొద‌టివ‌రుస‌లో సీటు కేటాయించారు.

ఇలాంటి తీరు మోడీ స‌ర్కారు ఇమేజ్‌ ను డ్యామేజ్ చేస్తుంద‌న్న విష‌యాన్ని గుర్తిస్తే మంచిది. రాహుల్‌ కు సీటు కేటాయించిన వైనంపై కేంద్రం వివ‌ర‌ణ ఇవ్వ‌న‌ప్ప‌టికీ.. ఈ త‌ర‌హా అవ‌మానాలు ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో రిజిస్ట‌ర్ కావ‌ట‌మే కాదు.. అధికార‌ప‌క్షానికి అహంభావం అంత‌కంత‌కూ పెరుగుతుంద‌న్న సంకేతాన్ని ఇస్తాయ‌ని మర్చిపోకూడ‌దు.
Tags:    

Similar News