బాబుకు రాహుల్ మ‌ద్దతు!..కేంద్రంపై నిప్పులు!

Update: 2019-02-11 10:17 GMT
ప్ర‌త్యేక హోదాను ఇవ్వ‌కుండా కేంద్రం ఏపీకి అన్యాయం చేసిన తీరుకు నిర‌స‌న‌గా టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయ‌డు ఢిల్లీలో చేప‌ట్టిన ఒక‌రోజు దీక్ష‌కు ప‌లు పార్టీల నుంచి మ‌ద్ద‌తు ల‌భించింది. ప్ర‌ధానంగా పార్ల‌మెంటులో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చంద్ర‌బాబు దీక్ష‌కు సంపూర్ణ మ‌ద్ద‌తును ప్ర‌క‌టించింది. నేటి ఉద‌యం మొద‌లైన బాబు దీక్ష‌కు సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ - మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ తో క‌లిసి వ‌చ్చారు. చంద్ర‌బాబు దీక్ష‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన రాహుల్ గాంధీ... న‌రేంద్ర మోదీ స‌ర్కారుపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని ఆయ‌న నినదించారు. అస‌లు దేశంలో ఏపీ భాగం కాదా? అంటూ రాహుల్ సంధించిన విమ‌ర్శ‌లు బాబు దీక్ష‌కు మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయ‌నే చెప్పాలి. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని టార్గెట్ చేసిన రాహుల్‌... త‌న‌దైన శైలి ప్ర‌శ్న‌లు సంధించారు. ప్ర‌ధాని మోదీ ఏపీ కి వెళ్లి అబ‌ద్దాలు చెబుతున్నార‌ని ఆరోపించిన రాహుల్‌..ఏపీ ప్ర‌జ‌ల‌ను నిలువునా మోసం చేసార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కాప‌లాదారుడే దొంగ అంటూ మోదీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ప్ర‌ధాని హోదాలో ఇచ్చిన హామీని మోదీ అమ‌లు చేయరా అని ప్ర‌శ్నించారు. ఏపీ భార‌తదేశంలో భాగం కాదా అని రాహుల్ నేరుగా ప్ర‌శ్నించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో తాము పూర్తి స్థాయిలో మ‌ద్ద‌తుగా నిలుస్తామ‌ని రాహుల్ హామీ ఇచ్చారు.

రాఫెల్ వ్య‌వ‌హారంలో మోదీ దొరికిన దొంగ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఏపీ ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం చేసే పోరాటాల‌కు త‌మ సంపూర్ణ‌ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసారు. మోదీ ప్ర‌ధానిగా మ‌రో రెండు నెల‌లు మాత్ర‌మే ఉంటార‌ని..వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోదీని ఓడిస్తామ‌ని రాహుల్‌ ధీమా వ్య‌క్తం చేసారు. రాహుల్ వెంట దీక్ష వ‌ద్ద‌కు వ‌చ్చిన మ‌న్మోహ‌న్ సింగ్ కూడా మోదీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. నాడు విభ‌జ‌న స‌మ‌యంలో పార్ల‌మెంట్ సాక్షిగా కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని ఆయ‌న‌ డిమాండ్ చేసారు. నాడు విభ‌జ‌న టైం లో అంద‌రూ ఏక‌గ్రీవంగా ఏపీకి హోదా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించార‌ని గుర్తు చేశారు. ప్ర‌భుత్వంలో ఎవ‌రు ఉన్నాపార్ల‌మెంటు సాక్షంగా ఇచ్చిన హామీలు అమ‌లు చేయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంలో ఉన్న‌వారి పై ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఏపీ ప్ర‌జ‌ల‌కు మ‌ద్ద‌తుగా తమ‌తో పాటుగా యావ‌త్ దేశం ఉంటుంద‌ని మ‌న్మోహ‌న్ వెల్ల‌డించారు.


Tags:    

Similar News