రాహుల్ తెలంగాణ టూర్ ఐదు గంట‌లే

Update: 2017-06-01 05:23 GMT
తెలంగాణ రాష్ట్రం ఇచ్చేస్తే చాలు.. అన్ని శుభ శ‌కునాలే అన్న‌ట్లుగా ఫీలై మ‌రీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం. తాను త‌లచింది ఒక‌టైతే.. జ‌రిగింది మ‌రొక‌టి అన్న‌ట్లుగా ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటైతే ఆ ఉద్య‌మ రాజ‌కీయ పార్టీని కాంగ్రెస్ లో క‌లిపేసేలా కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం కొంత‌మేర వ‌ర్క్ వుట్ చేసినా.. కేసీఆర్ క‌దిపిన పావులు.. తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల అనుభ‌వ రాహిత్యం వెర‌సి.. కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ఓ పెద్ద ప్ర‌శ్న‌గా మిగిలిపోయారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ కేసీఆర్ ను ట్రాక్ చేస్తున్నా.. ఒక్క‌సారి కాకుంటే ఒక్క‌సారి కూడా ఆయ‌న కంటే పైచేయి సాధించ‌లేని దుస్థితిలో నిలించింది కాంగ్రెస్ పార్టీ.

ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి .. రానున్న ఎన్నిక‌ల్లో ప‌లితాలు ఎలా ఉండ‌నున్నాయి? ప‌్ర‌జ‌లు ఎవ‌రి ప‌క్షాన ఉన్నారో చెప్పేలా ఒక స‌ర్వే ఫ‌లితాన్ని ప్ర‌క‌టించారు. ఏ సంస్థ ఈ స‌ర్వేను నిర్వ‌హించింద‌న్న వివ‌రాల‌తో పాటు.. మ‌రిన్ని వివ‌రాల్ని వెల్ల‌డించ‌కుండా.. టీఆర్ ఎస్ పార్టీ ఎంత బ‌లోపేతం అయ్యింది.. విపక్షాలు ఎంత వీక్ అయింద‌న్న విష‌యాన్ని త‌న మాట‌ల‌తో తేల్చేశారు కేసీఆర్‌.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాల్లో 111 స్థానాలు (గ‌వ‌ర్న‌ర్ తో భేటీ అయిన‌ప్ప‌డు 113 అని కూడా చెప్పుకున్నారు) టీఆర్ ఎస్ పార్టీ విజ‌యం సాధించ‌నుంద‌ని.. కాంగ్రెస్‌.. టీడీపీ.. బీజేపీ.. క‌మ్యూనిస్టులు క‌లిపి ముచ్చ‌ట‌గా మూడు సీట్లు కూడా సాధించ‌లేన‌ట్లుగా తేల్చేశారు.

మూడేళ్ల త‌మ పాల‌న‌లో తెలంగాణ ప్ర‌జ‌లు ఫుల్ హ్యాపీగా ఉన్నార‌న్న వాద‌న‌ను వినిపించ‌ట‌మే కాదు.. విప‌క్షాలు చేస్తున్న ఆందోళ‌ల కార‌ణంగా వారికి ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని తేల్చేశారు. గ‌డిచిన మూడేళ్ల‌లో తాము అమ‌లు చేస్తున్న వివిధ సంక్షేమ ప‌థ‌కాల్ని  గుక్క పెట్టి మ‌రీ చెప్పిన కేసీఆర్‌.. రానున్న రోజుల్లో ఏం చేయ‌నున్నార‌న్న విష‌యాన్ని క‌ల‌ర్ ఫుల్ గా చెప్పేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వానికి ఒక రోజు ముందుగా తెలంగాణ‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించ‌నున్నారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన ప్ర‌జాగ‌ర్జ‌న కార్య‌క్ర‌మంలో హాజ‌రై.. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. ఆయ‌న ప్ర‌సంగంలో కేసీఆర్ మీద విమ‌ర్శ‌లు ఏ స్థాయిలో ఉంటాయ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌క‌రంగా మారింది.

ఇదిలా ఉండ‌గా.. తన తాజా ప‌ర్య‌ట‌న‌లో రాహుల్ తెలంగాణ‌లో కేవ‌లం ఐదు గంట‌లు మాత్ర‌మే గ‌డ‌పనున్నారు. మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు హైద‌రాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్‌ కు రానున్న రాహుల్‌.. తిరిగి ఎనిమిదిన్న‌ర గంట‌ల‌కు విమానంలో ఢిల్లీకి తిరిగి వెళ్ల‌నున్నారు. ఈ ఐదు గంట‌ల్లో రాహుల్ ఏం చేయ‌నున్నార‌న్న విష‌యాన్ని చూస్తే..

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు: బేగంపేట ఎయిర్ పోర్ట్‌ లో ల్యాండింగ్‌

మ‌ధ్యాహ్నం 3.50 గంట‌ల‌కు:  కాంగ్రెస్ నేత‌ల‌తో భేటీ.. రోడ్ షో షురూ

మ‌ధ్యాహ్నం 4.00 గంట‌ల‌కు:  సోమాజీగూడ‌లోని రాజీవ్ విగ్ర‌హానికి నివాళి

మ‌ధ్యాహ్నం 4.25 గంట‌ల‌కు:  ఎర్ర‌గ‌డ్డ‌లో జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌తో భేటీ

సాయంత్రం  4.45 గంట‌ల‌కు:  కూక‌ట్ ప‌ల్లిలో నియోజ‌క‌వ‌ర్గ కార్య‌క‌ర్త‌ల‌తో అభివాదం

సాయంత్రం 5.00 గంట‌ల‌కు:   మియాపూర్‌ లో శేరిలింగంప‌ల్లి కార్య‌క‌ర్త‌ల‌కు అభివాదం

సాయంత్రం 5.20 గంట‌ల‌కు:   ప‌టాన్ చెర్వు కార్య‌క‌ర్త‌ల‌కు అభివాదం

సాయంత్రం 5.40 గంట‌ల‌కు:   సంగారెడ్డి ఆర్ అండ్ బీ అతిధి గృహంలో విశ్రాంతి

సాయంత్రం 6.45 గంట‌ల‌కు:    స‌ంగారెడ్డి ప్ర‌జాగ‌ర్జ‌న వేదిక‌కు చేరిక‌

రాత్రి        8.00 గంట‌ల‌కు:    ప్ర‌జాగ‌ర్జ‌న వేదిక నుంచి బేగంపేట‌కు ప్ర‌యాణం

రాత్రి        8.30 గంట‌ల‌కు:     ఢిల్లీకి తిరుగు ప్ర‌యాణం

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News