రాహుల్ సో స్పెష‌ల్‌..నెల‌నెలా తెలంగాణ‌కు

Update: 2018-08-09 11:00 GMT
రాబోయే ఎన్నిక‌ల్లో పార్టీ అధికార‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మిష‌న్ తెలంగాణ పేరుతో ప్ర‌త్యేక ప్రాజెక్టుకు శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో అధికార‌మే ల‌క్ష్యంగా పార్టీని స‌మాయ‌త్తం చేస్తున్న రాహుల్ ఈ మేర‌కు ప్ర‌త్యేక ఎజెండాతో ముందుకు సాగుతున్నారు. ఈనెల 13 - 14 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణ‌ పర్యటనకు రానున్న సంగ‌తి తెలిసిందే. రెండు రోజుల హైద‌రాబాద్ షెడ్యూలే హైద‌రాబాద్‌ లో ప‌లు వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తుండ‌గా....తాజాగా మ‌రో కీల‌క స‌మాచారం తెర‌మీద‌కు వ‌చ్చింది.  గాంధీభవన్‌ లో సేవాదళ్ క్రాంతి దివస్ కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాహుల్‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన స‌మాచారం వెల్ల‌డించారు. రాహుల్ ప‌ర్య‌ట‌న‌కు  సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. మహిళలు - విద్యార్థులు - 150మంది పారిశ్రామికవేత్తలు - సెటిలర్లు - ముస్లింలు - మీడియా సంస్థల ఎడిటర్స్ తో వేర్వేరుగా రాహుల్ సమావేశం అవుతారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

రాహుల్ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌పై ప్ర‌భుత్వం ఉద్దేశ‌పూర్వ‌కంగా అడ్డుకునే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ ప‌ర్య‌ట‌న‌ - ఆయ‌న ప‌ర్య‌ట‌న విష‌యంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. 18 ఓయూ విద్యార్థి సంఘాల ఆహ్వానం మేరకు.. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించబోతున్నారని ఉత్తమ్ చెప్పారు . రాహుల్ రాక నేప‌థ్యంలో ఓయూ వైస్ చాన్స్‌ ల‌ర్‌ ను అనుమ‌తి కోరామ‌ని, అయితే ఆయ‌న‌ సరైన నిర్ణయం చెప్పడం లేదన్నారు.  హరిత ప్లాజాలో రాహుల్ బస చేసేందుకు అడ్డంకులు పెడుతున్నారని..  ఎంపీగా ఉన్న రాహుల్ కు ప్రోటోకాల్ పాటించకపోవడం ఏంటని ఆయ‌న ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. రాహుల్ గాంధీకి హరిత ప్లాజాలో వసతి కల్పించడంపై రాష్ట్ర సీఎస్ జోషితో ఫోన్‌ లో ఉత్తమ్ మాట్లాడారు. రాహుల్ సమాచారం తనదగ్గర లేదని…పూర్తి సమాచారం తెల్సుకుని చెబుతానని సీఎస్ వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణ‌పై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టిన‌ట్లు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక నుంచి ప్రతి నెల రాష్ట్రంలో పర్యటిస్తారని చెప్పారు. వచ్చేనెలలో ఓ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆ సభకు రాహుల్ గాంధీ వస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ప‌లువురు నేతల మ‌ధ్య అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నాయే త‌ప్ప‌విబేధాలు లేవ‌న్నారు. ప్ర‌జ‌ల్లో టీఆర్ ఎస్ పార్టీపై వ్య‌తిరేక‌త ఉంద‌ని, ఇది రాబోయే ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా ప్ర‌తిబింబించ‌నుంద‌న్నారు.
Tags:    

Similar News