అగ్నికి ఆజ్యం పోస్తున్న రాహుల్ గాంధీ

Update: 2016-01-29 07:55 GMT
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీకి రానున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య చేసుకున్న వెంటనే ఇక్కడికి వచ్చి ఆందోళన చేసి దాన్ని దేశవ్యాప్త సమస్యగా మార్చిన రాహుల్ ఇప్పటికే రాజకున్న ఉద్యమాన్ని మరింత రాజేయడానికి మరోసారి వస్తున్నారు. శనివారం రోహిత్ బర్త్ డే అన్న విషయం తెలుసుకున్న ఆయన ఆ సందర్భాన్ని తన రాజకీయానికి ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. శుక్రవారం ఆయనకు ఈ సంగతి తెలియగానే వెంటనే ఆయన కొత్త ప్రణాళిక రచించారు. రోహిత్ జయంతి సందర్భంగా సెంట్రల్ యూనివర్సిటీలో ఒక రోజు నిరాహార దీక్ష చేయాలని డిసైడ్ చేశారు. దీనిపై ఇప్పటికే ఆయన తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులకు సమాచారం కూడా ఇచ్చారని తెలుస్తోంది.
   
శనివరాం రోహిత్ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ చాలా వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు వర్సిటీలో నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు. ఈ దీక్షలో ఆయన రోహిత్ కుటుంబసభ్యులనూ కలుపుతున్నారు. ఇందుకుగాను ఆయన శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుని నేరుగా వర్సిటీకి వెళ్తారు. అక్కడ రాత్రి నుంచి నిరాహార దీక్ష మొదలుపెడతారు. శనివారం సాయంత్రం దీక్షను విరమిస్తారు.
   
రోహిత్ ఆత్మహత్య అనంతర పరిణామాలతో ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం ఉంది. రాహుల్ ఇంతకుముందు రావడంతో వివిధ పార్టీలకు చెందిన జాతీయ స్తాయి నేతలంతా వెంటనే వచ్చి వాలిపోయారు. రోహిత్ దళితుడంటూరాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. అయితే... రోహిత్ తండ్రి చెప్పిన వివరాలు.. ఆయన దళితుడు కాకపోవచ్చన ఆధారాల నేపథ్యంలో చాలాపార్టీలు ఇందులోంచి పక్కకు తప్పుకున్నాయి. దీంతో ప్రస్తుతం ఇది కేవలం విద్యార్థి ఉద్యమంగానే ఉంది. దీంతో మరోసారి దీన్ని రాజకీయ ఉద్యమం చేయాలన్న ప్రయత్నంలోనే రాహుల్ వస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన విద్యార్థులను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఈ ఎత్తుగడ వేస్తున్నారని అంటున్నారు.

Tags:    

Similar News