కౌంటింగ్ కు కొన్ని గంట‌ల ముందు రాహుల్ ట్వీట్ మెసేజ్!

Update: 2019-05-22 12:31 GMT
నెల‌ల త‌ర‌బ‌డి ఎదురుచూస్తున్న రోజు మ‌రికొద్ది గంట‌ల్లో రానుంది. సుదీర్ఘంగా ఏడు విడ‌త‌ల్లో సాగిన పోలింగ్ ఫ‌లితాలు రేపు ఉదయం వెలువ‌డే అవ‌కాశం ఉంది. ఉద‌యం 8 గంట‌ల‌కు స్టార్ట్ అయ్యే ఓట్లు లెక్కింపు.. ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యానికి గెలుపోట‌ముల మీద ఒక అవ‌గాహ‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఆదివారం సాయంత్రం విడుద‌లైన ఎగ్జిట్ పోల్స్ పై విప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తుంటే.. ఆయా పార్టీల‌కు చెందిన కార్య‌క‌ర్త‌లు నిరాశ‌.. నిస్పృహ‌ల‌కు లోన‌య్యారు.

ఎగ్జిట్ పోల్స్ పుణ్య‌మా అని మోడీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేశార‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. అలాంటి వాటితో భారీ న‌ష్టం వాటిల్లుతుంద‌న్న భావ‌న రాజ‌కీయ పార్టీల అధినేత‌ల్లో నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తాజాగా ఒక ట్వీట్ చేశారు. కార్య‌క‌ర్త‌ల్లో నైతిక స్థైర్యంపెంచ‌టంతో పాటు.. వారిలో కొత్త శ‌క్తిని నింపేలా రాహుల్ ట్వీట్ ఉండ‌టం గ‌మ‌నార్హం.

కీల‌క‌మైన కౌంటింగ్ కు ముందు కార్య‌క‌ర్త‌లు స‌మ‌న్వ‌యం కోల్పోరాద‌ని.. వారి  క‌ష్టం వృధా పోద‌ని రాహుల్ వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్స్ దుష్ప్ర‌చారం చేస్తున్నాయ‌ని.. అవ‌న్ని త‌ప్పుడు స‌ర్వేలుగా కొట్టిపారేశారు రాహుల్. మ‌రో 24 గంట‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.. ఎవ‌రికీ భ‌య‌ప‌డొద్ద‌న్న ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌కు మ‌నోధైర్యాన్ని క‌లిగించే ప్ర‌య‌త్నం చేశారు.

రాహుల్ ట్వీట్ చూస్తే..  

‘ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలారా.. తదుపరి 24 గంటలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండండి. ఎవరికీ భయపడవద్దు. నకిలీ ఎగ్జిట్ పోల్స్‌ దుష్ప్రచారానికి మీరు నిరాశ పడవద్దు. మీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో ఉండండి. మీ కష్టం వృధా కాదు’ అని పేర్కొన్నారు.

    

Tags:    

Similar News