కరుణను రాహుల్ పరామర్శించారంటే..

Update: 2016-12-17 11:52 GMT
చరిత్ర పునరావృతం అవుతుందా? ఆలోచించుకుంటేనే ఆందోళన కలిగించేలా ఉంది తమిళనాడు రాజకీయ అధినేత ఆరోగ్య పరిస్థితి. తొంభయ్యో పడిలో ఉన్న తమిళనాడు రాష్ట్ర విపక్ష నేత.. డీఎంకేఅధినేత కరుణానిధి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందన్న వార్తలు వస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెన్నైకి రావటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేళ.. రాహుల్ గాంధీ వచ్చి పరామర్శించటం.. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందన్న సమాచారం బయటకు వచ్చిన వెంటనే రాహుల్ మరోసారి చెన్నై అపోలోకు రావటం మర్చిపోకూడదు. తాజాగా రాహుల్ చెన్నైకి రావటం.. కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణను పరామర్శించటం.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్న వైనం చూస్తుంటే.. కరుణ ఆరోగ్యం మరింత విషమించిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకే సమయంలో ఒక రాష్ట్రానికి చెందిన అధికారపక్ష అధినేత.. విపక్ష అధినేత ఇద్దరూ అనారోగ్యానికి గురి కావటం ఇబ్బందికరమైన పరిణామమే. వారిలో ఒకరు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన వైనం తమిళులను విపరీతమైన శోకాన్ని మిగిల్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా కరుణ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందన్న వార్తలు.. ఆయన అభిమానుల్ని.. పార్టీ నేతల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆసుపత్రి వర్గాలు మాత్రం కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన్ను త్వరలో డిశ్చార్జ్ చేస్తామని చెప్పటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News