యువరాజు డ్రగ్స్ తో దొరికిపోయాడా?

Update: 2015-07-22 06:32 GMT
భారతదేశంలోని ఏ రాజకీయ నేత నోటి నుంచి రానన్ని సంచలన విషయాలు ఒకే ఒక్క నేత నోటి నుంచి వస్తాయి. అలా అని కాలక్షేపం కోసమే.. సంచలనాల కోసమే.. ఇష్టారాజ్యంతో విమర్శలు చేసే వ్యక్తి కాకపోవటం బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి విలక్షణత.

ఆయన నోటి నుంచి ఏదైనా కుంభకోణం కానీ.. ఆరోపణ కానీ వచ్చిందంటే అందులో ఎంతోకొంత నిజం ఉండటమో.. లేదంటే విచారణ సంస్థలు సైతం నిగ్గు తేల్చటమో ఇప్పటివరకూ ఉన్నది. ఆయన ట్రాక్ రికార్డు చూస్తే.. ఆయన ఒకసారి ఏదైనా ఆరోపణ సంధిస్తే.. అది దావనంలా మారి.. చుట్టేసే పరిస్థితి. ఆయన బయటపెట్టిన కుంభకోణాల్లో మచ్చుకు 2జీ స్కాం ఒకటిగా చెప్పొచ్చు.

అలాంటి ఆయన తాజాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు.. కాంగ్రెస్ నేతలు యువరాజుగా కొలిచే రాహుల్ గాంధీపై ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. 2001లో అమెరికాలో రాహుల్ గాంధీ డ్రగ్స్ తో దొరికిపోయారని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న వాజ్ పేయ్ వద్దకు వచ్చిన సోనియా.. వేడుకోలుతో అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ తో మాట్లాడి.. ఇష్యూను క్లోజ్ చేశారని ఆరోపించారు.

తాజాగా స్వామి చేసిన ఆరోపణ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. రాహుల్ దగ్గర అమెరికా పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ దాదాపు 1.6లక్షల డాలర్ల వరకూ ఉంటుందని స్వామి ఆరోపిస్తున్నారు. ఒక హిందీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన విషయాల్ని వెల్లడించారు.

స్వామి ఆరోపణలపై ఇప్పటివరకూ కాంగ్రెస్ నేతలు స్పందించలేదు. బీజేపీ నేతల మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పార్లమెంటు రచ్చ రచ్చగా మారుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్న వేళ.. రాహుల్ కు సంబంధించిన అంశాన్ని (?) స్వామి బయటపెట్టటం వ్యూహాత్మకమా? అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. ఉత్త మాటలతో స్వామి ఆరోపణలు చేస్తున్నారా? లేదంటే.. అందుకు సంబంధించిన ఆధారాలు ఆయన దగ్గర ఏమైనా ఉన్నాయా? అన్నది తేలాల్సి ఉంది.
Tags:    

Similar News