రాహుల్ ఆశ వదిలేసినా కాంగ్రెస్‌పై ప్రజల ఆశ చావలేదు

Update: 2019-10-25 07:57 GMT
ఆర్నెళ్ల కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం పనైపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.. కానీ, అనూహ్యంగా 2014 కంటే భారీ మెజారిటీ సాధించింది మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం.. ఆ తరువాత ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ మినహా మిగతా ప్రాంతంలో మోదీ పట్ల మోజు మరింత పెరిగింది. ఇదేసమయంలో మహారాష్ట్ర, హరియాణాల్లో ఎన్నికలొచ్చాయి.. పోలింగ్‌కు ఒక రోజు ముందు పీవోకేలో భారత్ దాడులు చేయడం... బాలీవుడ్ నటులతో గెటు టుగెదర్ ఏర్పాటు చేయడంతో అవన్నీ బీజేపీకి మేలు చేస్తాయని భావించారు. కానీ.. హరియాణాలో మేజిక్ ఫిగర్ అందుకోలేకపోయింది బీజేపీ... మహారాష్ట్రలోనూ 214 కంటే సీట్లు తగ్గిపోయాయి.. పెద్దసంఖ్యలో మంత్రులు ఓడిపోయారు.. అదేసమయంలో మిత్రపక్షం శివసేన సీట్ల సంఖ్య పెరిగింది. దీంతో మహారాష్ట్రలోనూ బీజేపీ కమాండింగ్ పొజిషన్‌లో లేకుండా పోయింది. అంతేకాదు.. కాంగ్రెస్, ఎన్సీపీ, చివరకు ఎంఐఎం కూడా పోటీ ఇచ్చాయి. హరియాణాలో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది.. బీజేపీకి మేజిక్ ఫిగర్ రాకపోవడంతో అక్కడ జననాయక్ జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా దయపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

2019 ఎన్నికలకు ముందు బీజేపీ పనైపోయిందని దేశమంతా అనుకున్నట్లే ఆ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పనైపోయిందని అనుకోవడం మొదలైంది. దేశమే కాదు చివరికి ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అదే నిర్ణయానికి వచ్చేవారో ఏమో కానీ ఆయనా కాడి పక్కన పడేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా నీరసించిపోయింది. అయితే, ప్రజల్లో మాత్రం కాంగ్రెస్ పట్ల నిజంగా అలాంటి ఉద్దేశం లేదని తాజా ఎన్నికలే చెప్పాయి. మహారాష్ట్ర, హరియాణాతో పాటు ఉప ఎన్నికలు జరిగిన మరో 17 రాష్ట్రాల్లో అనేక చోట్ల కాంగ్రెస్ కొన్ని సీట్లు గెలుచుకోగలిగింది. రాహుల్ గాంధీ కనుక కాడి పక్కన పెట్టేయకుండా ఈ ఎన్నికల బాధ్యత చేపట్టి ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉండేవన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.

హరియాణా, మహారాష్ట్ర ఫలితాలు బీజేపీని ఆలోచనలో పడేశాయి. 2019 ఎన్నికల్లో తిరుగులేని విజయంతో 2024 కూడా మనదేనన్న విశ్వాసంతో ఉన్న మోదీ-షా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. సునాయాసంగా గట్టెక్కుతామనుకున్న మహారాష్ట్ర, హరియాణాల్లోనే ఇలాంటి కష్టం ఎదురైతే కొత్తగా ఆశలు పెంచుకుంటున్న మిగతా రాష్ట్రాల పరిస్థితేమిటన్న భయం వారిలో మొదలైంది.
Tags:    

Similar News