ఈడీ 50 గంటల విచారణపై రాహుల్ పై తాజా వ్యాఖ్యలు విన్నారా?

Update: 2022-06-23 05:31 GMT
రాష్ట్రాల రాజకీయాలు మారిపోవటం.. గతంలో ఎప్పుడూ లేనంత దారుణ పరిస్థితుల్లోకి వెళ్లటం కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే చూస్తున్నాం. అధికారంలో ఉన్న వారు ప్రతిపక్షంలోని వారిని టార్గెట్ చేయటం రాజకీయ దశ నుంచి వ్యక్తిగత స్థాయిలోకి మారిపోవటం ఈ మధ్యన ఎక్కువైన సంగతి తెలిసిందే.

గతంలో ఎప్పుడూ లేని రీతిలో గాంధీ కుటుంబానికి చెందిన వారు విచారణ సంస్థల విచారణకు హాజరయ్యే పరిస్థితి చోటు చేసుకుంది. అలా అని గాంధీ కుటుంబం అవినీతికి పాల్పడి ఉంటే.. దాన్ని భరించాల్సిన అవసరం ఈ దేశానికి లేదు. అదే సమయంలో.. ఏదో సందేహంతో తొందరపాటు కూడా మంచిది కాదు.

నేషనల్ హెరాల్డ్ విషయంలో ఐదు రోజుల పాటు యాభై గంటలకు పైనే కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. సాధారణంగా రాజకీయ ప్రముఖుల్ని విచారించిన సమయంలో.. అధికారులు ఏం ప్రశ్నలు వేశారు? దానికి సదరు నేత ఎలాంటి సమాధానాలు చెప్పారన్న విషయాలు బయటకు వచ్చేవి. రాహుల్ విషయంలో అలాంటివి తక్కువే వచ్చాయని చెప్పాలి. ఈడీ విచారణను ఎదుర్కొన్న రాహుల్ ను పరామర్శించేందుకు ఆయనకు సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్ ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు.

ఈ సందర్భంగా వారితో భేటీ అయిన రాహుల్.. ఈడీ విచారణపై స్పందించారు.తనను విచారించిన అధికారులకు తన ఓర్పు.. సహనం..విసుగు లేకుండా రియాక్టు అయిన విధానానికి ఆశ్చర్యానికి గురైనట్లుగా ఆయన చెప్పారు. తనను విచారించిన అధికారులు.. 'గంటల కొద్దీ ప్రశ్నలు ఎదుర్కొంటూ.. అలుపు సొలుపు లేకుండా గంటల తరబడి కదలకుండా కుర్చీలో కూర్చునేంత ఓపిక ఎలా వచ్చింది" అని ప్రశ్నించారు.

వారి ప్రశ్నకు ముందు సమాధానం చెప్పనని చెప్పానని.. తర్వాత విపాసన ధ్యాన ప్రక్రియ సాధన చేస్తుండటమేనని కారణంగా తాను చెప్పినట్లుగా చెప్పిన రాహుల్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారింది. ఈడీ అధికారులకు తాను చెప్పిన సమాధానం సరదాగా చెప్పిందేనని.. అసలు కారణం అది కాదన్నారు. ఆ చిన్న గదిలో ముగ్గురు ఈడి అధికారుల సమక్షంలో కూర్చున్నా.. నేను ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ తనకు కలగలేదన్నారు.

తన వెనుక కాంగ్రెస్ కార్యకర్తల స్ఫూర్తి ఉందని.. 2004 నుంచి పార్టీకి ఒక కార్యకర్త మాదిరి పని చేస్తున్నానని.. అదే తనకు ఓపికను నేర్పిందని చెప్పారు. ఐదు రోజుల విచారణలో ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను ఓపిగ్గా సమాధానం చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఏమైనా.. తనకున్న శక్తి సామర్థ్యాల్ని తన తాజా వ్యాఖ్యలతో చెప్పటమే కాదు.. తనలోని నేర్పును రాహుల్ తెలివిగా బయటపెట్టారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News