కొరడాతో కొట్టుకున్న రాహుల్‌ గాంధీ

Update: 2022-11-03 09:30 GMT
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అధికారం సాధించి పెట్టడమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర చురుగ్గా కొనసాగుతోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల్లో జోడో యాత్ర ముగిసింది. ఇప్పుడు తెలంగాణలో యాత్ర సాగుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా భారత్‌ జోడో యాత్రకు 52 రోజులు పూర్తయ్యాయి. ఐదు రాష్ట్రాల్లో యాత్ర జరిగింది.

కాగా భారత్‌ జోడో యాత్రకు ప్రజలు వెల్లువలా తరలివస్తున్నారు. వ్యవసాయ కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, చిరు వ్యాపారులు, చిన్నారులు ఇలా ప్రతి ఒక్కరూ రాహుల్‌ గాంధీతో కలసి పాదయాత్రలో మమేకమవుతున్నారు. ఆయనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇక ఆయా రాష్ట్రాల్లో చోటా నేతల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు సరేసరి.

కాగా తెలంగాణలో జరుగుతున్న తన పాదయాత్రలో భాగంగా రాహుల్‌ గాంధీ తనను కలవడానికి విద్యార్థులు, రైతులు, మేధావులు, ప్రొఫెసర్లతో చర్చిస్తున్నారు. మరోవైపు రాహుల్‌ పాదయాత్రతో తెలంగాణ కాంగ్రెస్‌లో నూతనోత్సాహం వచ్చిందని చెబుతున్నారు.

కాగా పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.  ఆయన తలపెట్టిన భారత్‌ జోడో యాత్ర ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పోతు రాజు అవతారం దాల్చారు.

ఈ సందర్భంగా పోతురాజులు రాహుల్‌ గాంధీని కలిశారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాలు, పోతురాజుల గురించి సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాహుల్‌కు వివరించారు.

ఈ క్రమంలో పోతురాజుల నుంచి కొరడా అందుకున్న రాహుల్‌ దానితో పోతు రాజుల మాదిరిగా కొట్టుకున్నారు. దీంతో రాహుల్‌ గాంధీ చేసిన విన్యాసాలకు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఆశ్చర్యపోయారు.

కాగా సంగారెడ్డి జిల్లాలో రాహుల్‌ గాంధీ పాదయాత్రకు భారీ స్పందన లభిస్తోంది. భారీ ఎత్తున కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఏఐసీసీ, రాష్ట్ర అగ్రనేతలు ఆయన వెంట అడుగులో అడుగు వేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News