పీకే టీం ఓవ‌ర్ అయిపోయిందా...

Update: 2019-08-11 17:30 GMT
ప్ర‌ముఖ వ్యూహకర్త - జేడీయూ నేత ప్రశాంత్ కిశోర్ త‌న లిమిట్స్ క్రాస్ చేస్తున్నాడా ?  ఒక వ్యూహాక‌ర్త‌గాను తాను త‌న టీంతో చేయించాల్సిన ప‌నుల‌ను క్రాస్ చేస్తున్నారా ?  ఇటీవ‌ల ఏపీ ఎన్నిక‌ల్లో తాను వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న వైసీపీ ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో పాటు ఆ పార్టీకి ఏకంగా 151 సీట్లు రావ‌డంతో ప్ర‌శాంత్ కిషోర్‌ లో మితిమీరిన ఆత్మ‌విశ్వాసం వ‌చ్చేసిందా ? ఇప్పుడు ప్ర‌శాంత్ కిషోర్ తాను ప‌నిచేసే పార్టీ వ్య‌వ‌హారాలే కాకుండా ఏకంగా ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో కూడా జోక్యం చేసుకునే స్థితికి వ‌చ్చేశారా ? అంటే బెంగాల్ బీజేపీ నేత‌ల ఆరోప‌ణ‌లు అవుననే చెపుతున్నాయి.

ఏపీలో పీకే వ‌ర్క్ చేసిన వైసీపీ విజ‌యం సాధించాక దేశ‌వ్యాప్తంగా చాలా రాజ‌కీయ పార్టీల దృష్టి ఒక్కసారిగా పీకే వైపు ప‌డింది. పలువురు రాజ‌కీయ పార్టీల అధ్య‌క్షులు - త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు పీకే స్ట్రాట‌జీ వాడుకోవాల‌ని చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా బెంగాల్‌ లో వ‌రుస‌గా మూడోసారి విజ‌యం సాధించాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోన్న ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ పీకే సేవ‌ల‌ను తమ పార్టీ కోసం వాడుకునేందుకు రెడీ అయ్యారు.

ఈ క్ర‌మంలోనే పీకే టీం బెంగాల్‌ లో ఇప్ప‌టికే వ‌ర్క్ స్టార్ట్ చేసింది. ఎలాగైనా బెంగాల్ పీఠంపై కాషాయ జెండా ఎగ‌ర‌వేయాల‌ని భావిస్తోన్న బీజేపీ అధిష్టానానికి ఇప్పుడు పీకే ఇప్పుడు కాస్త అడ్డంకిగా మారాడు. ఈ క్ర‌మంలోనే బెంగాల్ బీజేపీ నేత‌లు పీకేను టార్గెట్‌ గా చేసుకుని విమ‌ర్శ‌లు ప్రారంభించేశారు. పీకేతో పాటు ఆయ‌న టీం స‌భ్యులు బెంగాల్ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాకుండా తమ ఆదేశాలు పాటించాల‌ని ప్ర‌భుత్వ యంత్రాంగంపై ఒత్తిడి కూడా చేస్తున్నార‌ని బెంగాల్ బీజేపీ నేత‌లు విమ‌ర్శించారు.

ఈ ఆరోప‌ణ‌లను అటు టీఎంసీతో పాటు పీకే టీం స‌భ్యులు ఖండించారు. దీనిపై బీజేపీ నేత‌లు ప‌దే ప‌దే ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్ సిన్హా మాట్లాడుతూ పీకే బృందం ప్ర‌జ‌ల ఫ్యీడ్ బ్యాక్ ముసుగులో ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లోకి వెళ్లి అక్క‌డ అధికారుల‌ను తాము చెప్పిన‌ట్టు వినాల‌ని ఆదేశిస్తున్నార‌ని ఆరోపించారు. పీకే నుంచి టీఎంసీ ఎన్ని స‌ల‌హాలు తీసుకున్నా త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని... ఆ పార్టీ మునిగిపోయే నావ అయినందున ఇలాంటి స‌ల‌హాలు వేస్ట్ అని కూడా ఆయన ఎద్దేవా చేశారు. త‌మ‌పై విమ‌ర్శ‌ల‌ను టీఎంసీ నేత‌లు ఖండిస్తున్నా పీకే టీంపై వ‌స్తోన్న ఆరోప‌ణ‌లు మాత్రం సంచ‌ల‌నంగానే మారాయి. ఇప్పుడు బెంగాల్‌ లో బీజేపీ వ‌ర్సెస్ టీఎంసీ ఫైట్ కాస్తా బీజేపీ వ‌ర్సెస్ పీకే & టీం ఫైట్‌గా మారిపోయింది. ఏదేమైనా బెంగాల్ రాజ‌కీయాలు రోజు రోజుకు ర‌స‌వత్త‌రంగా మారుతున్నాయి.
 
Tags:    

Similar News