పాదయాత్రలో మనసు దోచేస్తున్న రాహుల్.. వృద్ధురాలికి సపర్యలు

Update: 2022-11-02 15:30 GMT
భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాందీ తీరు అంతకంతకూ ఆకట్టుకుంటోంది. ఇంతకాలం పప్పు అని.. అమూల్ బేబీ అని.. యువరాజు అంటూ ఆయన్ను తప్పుగా అర్థం చేసుకున్న దేశ ప్రజలకు.. జోడో యాత్ర సందర్భంగా తానేమిటో అర్థమయ్యేలా చేస్తూ.. ఇంతకాలం రాహుల్ ను తప్పుగా అర్థం చేసుకున్నామే అన్న భావన కలిగేలా చేస్తున్నారు. ప్రస్తుతం మైదరాబాద్ లో పాదయాత్ర చేస్తున్న ఆయనకు భారీ ఎత్తున స్వాగతం లభించింది.

పెద్ద ఎత్తున ప్రజలు ఆయన్ను చూసేందుకు ఆసక్తి చూపించటంతో.. ఆయన నడుస్తున్న ప్రాంతాల్లోని రెండు వైపులా పెద్ద ఎత్తున ప్రజలు చేరటం ఒక ఎత్తు అయితే.. కాంగ్రెస్ పార్టీకి.. నతలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నారు రాహుల్ గాంధీ.

పాదయాత్రలో భాగంగా ఒక వృద్ధురాలు తనకు దగ్గరగా వచ్చే ప్రయత్నంలో జరిగిన తోపులాటలో ఆమె కింద పడ్డారు. దాదాపు స్పృహ తప్పిన పరిస్థితి చోటు చేసుకుంది. ఆ పెద్ద  వయస్కురాలైన మహిళ పడుతున్న ఇబ్బందిని గుర్తించిన రాహుల్... తన పాదయాత్రను ఆపారు. ఆమెకు మంచినీళ్లు తెప్పించారు.

తానే స్వయంగా పైకి లేపి.. ఆమె బాగుందా? అని అడిగారు. ఆమెకు అవసరమైన సపర్యలు చేశారు. ఆమె చెప్పుల్ని తానే స్వయంగా తీసుకొచి ఆమెకు ఇచ్చారు. పాదయాత్ర సందర్భంగా తాను ఎంత సింపుల్ గా ఉంటానన్న విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో చూపిస్తున్న రాహుల్ తీరుతో ఆయనపై ఇప్పటివరకున్న అభిప్రాయం మారటమే కాదు.. ఆయన్ను ఇంతకాలం తప్పుగా అర్థం చేసుకున్నామన్న భావన కలిగేలా చేస్తున్నారు.

మొన్నటికి మిన్న తనను చూసేందుకు ఒక కాంగ్రెస్ కార్యకర్త అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ.. తన వద్దకు దూసుకురావటంతో ఒకింత ఇబ్బందికి గురైనప్పటికీ.. అతని మీద రాహుల్ మాత్రం ఎలాంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదు. సదరు యువకుడ్ని భద్రతా సిబ్బంది బలంగా పక్కకు పంపే ప్రయత్నం చేశారు.

ఈ  సందర్భంలో భద్రతా సిబ్బందిని వారించి.. ఆ అభిమానిని దగ్గరకు పిలిచారు రాహుల్. దీంతో ఆ అభిమాని ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. మొత్తంగా పాదయాత్ర పుణ్యమా అని అసలుసిసలు రాహుల్ ఎలా ఉంటాడు? ఆయన తీరు ఎలా ఉంటుందన్న విషయం సాదాసీదా ప్రజలకు ఇట్టే అర్థమయ్యేలా చేశారని చెప్పొచ్చు. జోడోయాత్ర కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంటే.. దేశ సారథ్యానికి రాహుల్ కున్న సమర్థత ఏమిటన్న విషయాన్ని దేశ ప్రజలు అర్థం చేసుకునే అవకాశం కలిగందని చెప్పక తప్పదు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News