కేటీఆర్ స‌హా ఆ మంత్రులంతా సేఫ్‌

Update: 2017-08-31 05:13 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు మంత్రి కేటీఆర్‌ కు పెద్ద రిలీఫ్ వ‌చ్చిన‌ట్ల‌యింది. ఇంకా చెప్పాలంటే న్యాయ‌వ్య‌వ‌స్థపై న‌మ్మ‌కం కుదిరే చ‌ర్య‌గా చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసులను రైల్వే న్యాయమూర్తి కొట్టేశారు. ఈ కేసులో ప్ర‌స్తుతం మంత్రులుగా టీఆర్ ఎస్ నేత‌లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి - ఐటీ - పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు - ఎక్సైజ్‌ శాఖ మంత్రి టీ పద్మారావుపై విస్తృత‌మైన రీతిలో విచార‌ణ జ‌రిగింది.ఈ కేసు ఆరేళ్ల‌కు పైగా విచార‌ణ జ‌రిగిన నేప‌థ్యంలో ఒక ద‌శ‌లో న్యాయ‌వ్య‌వ‌స్థ ఇంత స‌మ‌యం తీసుకొని సుదీర్ఘంగా విచార‌ణ చేస్తుంద‌నే అభిప్రాయాన్ని కేటీఆర్ వ్య‌క్త‌ప‌రిచారు.

ఇటీవ‌లి కాలంలో ఈ కేసులో వ‌రుస‌గా కోర్టుకు హాజ‌ర‌వ‌డంతో అన్ని వ‌ర్గాల్లో ఆస‌క్తి నెల‌కొంది. అయితే ఈ తాజాగా ఈ కేసులో ఉప‌శ‌మ‌నం ద‌క్కింది. మంత్రులు కేటీఆర్‌ - నాయిని - ప‌ద్మారావు స‌హా మరో 11 మందికి ఊరట లభించింది. కేసు కొట్టేసిన అనంతరం సికింద్రాబాద్‌ లోని రైల్వే కోర్టు వద్ద హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2011లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారన్నారు. అదే సమయంలో మౌలాలి రైల్వే స్టేషన్‌ లో రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారని ఆర్ఫీఎఫ్ పోలీసులు 14 మందిపై కుట్ర పూరితంగా అభియోగాలు మోపారన్నారు. దీంతో తాము అనేకసార్లు కోర్టుకు హాజరయ్యామన్నారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి తమపై పెట్టిన కేసులను కొట్టి వేశారని తెలిపారు.

మొదటి నుంచి తమకు న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉన్నదని, ఈ రోజు జడ్జి ఇచ్చిన తీర్పు తమకు ఎంతో ఆనందం కలిగించిందని, ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ న్యాయం జరిగిందన్నారు. అదే విధంగా ఉద్యమ సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో రైళ్లను ఆపామంటూ ఖాజీపేటలోని రైల్వే కోర్టు నుంచి మంత్రి కేటీఆర్‌ కు - తనకు సమన్లు అందాయని - వచ్చే నెల 27న తాము అక్కడి కోర్టులో హాజరవుతామని వివరించారు.
Tags:    

Similar News