దేశం చ‌చ్చిపోయింద‌ని ప్ర‌క‌టిస్తారా?

Update: 2016-11-20 09:28 GMT
బీజేపీ మిత్రపక్షమైన శివసేన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్రంగా విరుచుకుప‌డింది. నోట్లరద్దు మరణాలను కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ ఉరీ ఉగ్రదాడితో పోల్చడాన్ని స‌మర్థించిన శివ‌సేన ఆజాద్ క్షమాపణలు చెప్తే వాస్తవం మారుతుందా? అని బీజేపీని ప్రశ్నించింది. నోట్లరద్దు మరణాలకు మన పాలకులే కారణమని శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. ద్రవ్యోల్బణం-ఆర్థికమాంద్యం- నిరుద్యోగం ఫలితంగా 40 మంది మరణించినా, 40 లక్షల మంది మరణించినా ఈ ప్రభుత్వం వారిని దేశభక్తి కోసం బలైన అమరులుగానే కీర్తిస్తుందని, యావత్తు దేశాన్ని అమరజీవిగా ప్రకటించే రోజు వస్తుందని సామ్నా ఎద్దేవా చేసింది. మిత్రపక్షమైన శివసేన ఇలా విమర్శలు ఎక్కుపెట్టడం, విపక్షాలతో కలిసి సర్కారుకు వ్యతిరేకంగా కదం తొక్కడంపై ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రేకు హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ ఫోన్‌ చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు.

మ‌రోవైపు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే సైతం కేంద్రానికి హెచ్చ‌రిక‌లు జారీచేశారు. కేంద్ర సర్కారు చేపట్టిన నోట్లరద్దు చర్య విఫలమైతే దేశంలో తీవ్ర సంక్షోభం వస్తుందని రాజ్ ఠాక్రే హెచ్చరించారు. నిర్ణయం వెనుక లోతైన సమాలోచన లేకుంటే తీవ్రంగా పరిగణించాల్సిందేనని అన్నారు. అందరూ నోట్లరద్దు వల్ల భవిష్యత్తు బాగుపడుతుందని అంటున్నారు కానీ అదెలాగో ప్రధాని చెప్పడంలేదని పేర్కొన్నారు. "ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రిలయన్స్‌ కు సలహాదారుగా ఉండేవారు. రిలయన్స్ జియో డిసెంబర్ 30 వరకు ఉచిత సేవలు అందిస్తోంది. నోట్లరద్దు చివరి గడువు కూడా డిసెంబర్ 30వ తేదీయే కావడం కాకతాళీయమా?" అని రాజ్ ఠాక్రే ప్రశ్నించారు.

ప్ర‌తిప‌క్షాల‌కు తోడుగా మిత్ర‌ప‌క్షమైన శివ‌సేన సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో బీజేపీ పెద్ద‌లు రంగంలోకి దిగారు. నోట్లరద్దు వల్ల అసౌకర్యం కలిగినందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా క్షమాపణలు చెప్పారు. అయితే ఇది తప్పనిసరి శస్త్రచికిత్స లాంటిదని అన్నారు. లక్నోలోని బాబూ బనార్సీదాస్ యూనివర్సిటీ యూత్ టౌన్‌ హాల్‌ లో యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఎలాంటి శస్త్రచికిత్స అయినా బాధాకరంగానే ఉంటుందని అమిత్ షా అన్నారు. కొద్దిరోజుల్లో సాధారణ పరిస్థితి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఒక్కటికావడం తుపానులో కొట్టుకుపోతున్నవారందరూ ఒకే కొమ్మను పట్టుకొన్నట్టుగా ఉందని ఆయ‌న ఎద్దేవా చేశారు. నోట్లరద్దుతో ప్రభుత్వంలో, రాజకీయాల్లో నైతికత నెలకొంటుందని హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ చెప్పారు. అంతేకాకుండా ధనిక - పేద అంతరాన్ని కూడా ఇది తగ్గిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సహజంగానే ఇది అవినీతిపరులు - ఉగ్రవాదుల ఆర్థిక వనరులను అడ్డుకుంటుందని, కొన్నాళ్లు కష్టాలు తప్పవని హోంమంత్రి ఢిల్లీలో అన్నారు. కేంద్ర నిర్ణయంతో నల్లధనం కోల్పోయినవారే పార్లమెంటు పనిచేయకుండా అడ్డుకొంటున్నారని కేంద్ర జౌళిశాఖమంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు అడ్డుపడటం వల్ల రెండు రోజులుగా పార్లమెంటులో సభా కార్యక్రమాలు ముందుకు సాగడం లేదని అహ్మదాబాద్‌ లో మీడియాతో అన్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News