మోడీ స‌భ‌లో ఒకేఒక్క‌డు క‌నిపించ‌లేదేం?

Update: 2019-04-02 04:31 GMT
తెలంగాణ రాష్ట్రం మొత్తమ్మీదా ఒకే ఒక్క బీజేపీ ఎమ్మెల్యేగా.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సంత‌రించుకున్న గోషామ‌హ‌ల్ రాజాసింగ్ ప్ర‌ధాని మోడీ స‌భ‌కు డుమ్మా కొట్ట‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాజాసింగ్ ఓట‌మికి బీజేపీ నేత‌లు ప‌లువురు ప్ర‌య‌త్నించార‌న్న ఆరోప‌ణ ఉంది. రాజాసింగ్ తీరుపై తెలంగాణ బీజేపీ నేత‌లు అసంతృప్తితో ఉన్న‌ట్లు వార్త‌లు రావ‌టం తెలిసిందే.

ఎన్ని విభేదాలు ఉన్నా.. ప్ర‌ధాని స్థాయి నేత‌.. అందునా సొంత పార్టీకి చెందిన బిగ్ బాస్ వ‌చ్చిన‌ప్పుడు.. స్థానికంగా ఉండే సొంత పార్టీ ఎమ్మెల్యే త‌ప్ప‌నిస‌రిగా హాజ‌ర‌వుతారు. కానీ.. అందుకు భిన్నంగా రాజాసింగ్ మాత్రం డుమ్మా కొట్టారు. త‌న విష‌యంలో పార్టీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. లోక్ స‌భ అభ్య‌ర్థుల పేర్ల‌ను ఖ‌రారు విష‌యంలో అధినాయ‌క‌త్వం వ్య‌వ‌హ‌రించిన తీరుతో రాజాసింగ్ మ‌న‌స్తాపానికి గురైన‌ట్లు తెలుస్తోంది.

దీంతో.. గ్రేట‌ర్ ప‌రిధిలోని బీజేపీ నేత‌ల‌తో అంటీముట్ట‌న‌ట్లుగా రాజాసింగ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విషయం ఏమంటే.. గ్రేట‌ర్ ప‌రిధిలోని పార్టీ కార్య‌క‌లాపాల విష‌యంలో ఏ మాత్రం జోక్యం చేసుకోని ఆయ‌న‌.. గ‌డిచిన వారంగా నిజామాబాద్‌.. క‌రీంన‌గ‌ర్‌.. మెద‌క్.. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ స్థానాల్లో అభ్య‌ర్థ‌లు కోసం పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తున్న ఆయ‌న‌.. హైద‌రాబాద్ లో అందునా తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న ఎల్ బీ స్టేడియంలో జ‌రిగిన ప్ర‌ధాని కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాకుండా త‌న నిర‌స‌న‌ను చెప్ప‌క‌నే చెప్పేశార‌న్న మాట వినిపిస్తోంది.మ‌రి.. రాజాసింగ్ గైర్హాజ‌రును మోడీ మాస్టారు గ‌మ‌నించారంటారా?
Tags:    

Similar News