టీ బీజేపీకి సొంత ఎమ్మెల్యే ఝ‌ల‌క్‌

Update: 2015-09-10 14:36 GMT
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ‌లో బ‌ల‌ప‌డ‌టానికి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నం చేస్తోంది. బీజేపీ అగ్ర‌నేత‌లు సైతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కంటే తెలంగాణ‌పైనే ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ బీజేపీ ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తోంది. రైతు సమస్యలపై దీక్షలు,  చీప్‌ లిక్కర్‌ కు వ్యతిరేకంగా పోరాటాలు, గ్రేటర్‌ లో పన్నులు తగ్గించాలంటూ ఆందోళనలు... ఇలా ఏదో ఓ సమస్య తో జనంలోకి  వెళ్తోంది. బీజేపీ నేతలతో పాటు ఎమ్మెల్యే లు, ఎంపీ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఈ క్ర‌మంలోనే గ్రేటర్‌ హైదరాబాద్‌ లో కూడా క‌మ‌ల‌నాథులు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే..గోషామహల్‌ ఎమ్మెల్యే  రాజాసింగ్‌ మాత్రం నియోజకవర్గానికే పరిమితమవుతున్నారు. ఈ వైఖ‌రి ఇంటాబయటా చర్చనీయాంశమవుతోంది. తెలంగాణలో బీజేపీకి ఎమ్మెల్యేలు ఐదుగురు ఉన్నా ఎప్పుడు చూసినా నలుగురు ఎమ్మెల్యే ల హడావుడే కనిపిస్తోంది. ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఏ కార్యక్రమంలోనూ కనిపించట్లేదు. పార్టీ త‌ర‌ఫున గొంతుక వినిపించడంలేదు. ఒకప్పుడు కార్పొరేటర్‌ గా హల్‌ చల్‌ చేసిన రాజాసింగ్‌ ఎమ్మెల్యే  అయిన తర్వాత పార్టీ తో డిస్టెన్స్‌ మెయింటైన్‌ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

రాజాసింగ్‌ మిగతా ఎమ్మెల్యే లతో ఎందుకు కలవలేకపోతున్నారన్నది పార్టీలో హాట్‌ టాపికైంది. మిగతా నలుగురు ఎమ్మెల్యేలతో  పోలిస్తే రాజాసింగ్‌ జూనియర్‌. రాజకీయానుభవం కూడా తక్కువే. రాష్ట్రస్థాయి రాజకీయాలు చేసిన అనుభవం ఏమాత్రం లేదు. కానీ ఇప్పుడాయన పార్టీ ఎమ్మెల్యే. అయిన‌ప్ప‌టికీ మిగతా ఎమ్మెల్యేలకు దూరంగా ఎందుకుంటున్నారన్న ప్రశ్నకు జవాబు దొరకడంలేదు. ప్రజాసమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటాల్లోనే కాదు... పార్టీ కార్యక్రమాల్లోనూ రాజాసింగ్‌ అరుదుగా కనిపిస్తున్నారు. అసలు రాజాసింగ్‌ వీరికి  దూరంగా ఉంటున్నారా... లేక ఆయన్ని మిగ‌తావారే దూరంగా పెడుతున్నారా అన్న సందేహాలున్నాయి.

చిన్నచిన్న మీటింగ్‌ ల సంగతి పక్కనపెడితే... కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఎంపీ బండారు దత్తాత్రేయ లాంటి పార్టీ పెద్దలు  హాజరయ్యే కార్యక్రమాలకు కూడా రాజాసింగ్‌ దూరంగా ఉండటం సందేహాలు లేవనెత్తుతోంది. అసలు తెలంగాణలో బీజేపీ  ఎమ్మెల్యేలు నలుగురా? ఐదుగురా అన్న సెటైర్లు పొలిటికల్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. రాజాసింగ్‌ పూర్తిగా నియోజకవర్గానికే  పరిమితమవుతున్నారు. రాజధానిలో బీజేపీ పెద్దఎత్తున కార్యక్రమాలు చేస్తున్నా... ఇక్కడే ఉన్న ఎమ్మెల్యే వాటికి డుమ్మా  కొట్టడమేంటన్న చర్చ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాలపై రాజాసింగ్‌ పెద్దగా ఆసక్తి చూపించట్లేదని తెలుస్తోంది.

త్వరలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎన్నికలున్నాయి. మరోవైపు తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం బీజేపీ కృషి చేస్తోంది.  ప్రజాసమస్యలపై ఈ మధ్యే దూకుడు పెంచింది. ఇలాంటి టైమ్‌లో ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఒకరు దూరంగా ఉండటం... పార్టీకి మంచిది కాదన్న చర్చ టీ-బీజేపీలో జరుగుతోంది. మరి గ్రేటర్‌ ఎన్నికల గంట మోగే నాటికైనా రాజాసింగ్‌ దారిలోకి వస్తారా... లేక  ఇలాగే దూరంగా ఉంటారా? చూడాలి మ‌రి.
Tags:    

Similar News