కత్తి మహేశ్‌ కు కొత్త శత్రువులు

Update: 2017-12-10 05:37 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పై రంకెలేసే సినీ క్రిటిక్ కత్తి మహేశ్ నిత్యం పవన్ అభిమానుల నుంచి ఆగ్రహావేశాలు - ఎగతాళికి గురవుతున్న సంగతి తెలసిందే.. ఇప్పటికున్నది చాలదన్నట్లుగా ఆయన కొత్తగా మరికొందరు శత్రువులను కూడా సంపాదించుకుంటున్నారు.
    
పవన్ కల్యాణ్ ని విమర్శించే క్రమంలో కత్తి ప్రధాని నరేంద్ర మోదీపై కూడా ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో బీజేపీ నేతలు ఈ విషయాన్ని సీరియస్‌ గా తీసుకున్నారు. ముఖ్యంగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ దీనిపై సీరియస్ అయ్యారు. చౌకబారు పబ్లిసిటీ కోసం ప్రధాని నరేంద్ర మోదీపై ఆరోపణలు చేయడం తగదని రాజా సింగ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా మండిపడ్డారు. అంతేకాదు... మోదీని నరహంతకుడు అన్న కత్తిపై కేసు నమోదు చేయాలని హైదరాబాద్ సిటీ పోలీసులకు విన్నవించుకుంటున్నానని ఆ ట్వీట్ లో కోరారు.
    
కాగా రాజాసింగ్ ట్వీట్ కు హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విటర్లోనే స్పందించారు. ‘తగు చర్యల నిమిత్తం సంబంధింత అధికారికి మేము షేర్ చేస్తాం. థ్యాంక్యూ’ అని వారు ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే కత్తి అరెస్టయ్యారన్న ప్రచారం ముమ్మరంగా జరిగింది. అయితే... తానేమీ అరెస్టు కాలేదంటూ ఆయన ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చి మాట్లాడారు. అక్కడితో ఆగని ఆయన... ఇదేమీ అరెస్టయ్యేంత కేసు కాదు - రాజాసింగ్ కేవలం ట్విటర్లో కంప్లయింట్ చేశారు. ఇదేమీ కాదన్నట్లుగా మాట్లాడారు. ‘‘నేను స్వ‌తంత్రుడిని.. ఎంత వ‌ర‌కు మాట్లాడితే మ‌నకి ఏమి కాదో ఆ విష‌యాలు నాకు తెలుసు. నాకు నా హ‌క్కులు తెలుసు. అస‌లు అరెస్టుకే ఆస్కారం లేదు’’ అని కత్తి చెప్పారు.
    
అయితే... కత్తి చెప్పినట్లేమీ జరగలేదు. ఆయన మళ్లీ ఫేస్ బుక్ లైవ్‌ లోకి వచ్చి పెద్దపెద్ద మాటలు చెప్పడంతో రాజాసింగ్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. పోలీసులతో ఆయన మాట్లాడి.. ట్వీటర్ తనకిచ్చిన మాట ఏమైందని అడిగినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు తాజాగా కత్తి మహేశ్ పై కేసు నమోదు చేసినట్లు చెప్తున్నారు.
Tags:    

Similar News