ప్రేమకథ అనుమానాస్పద మృతిగా ముగిసింది

Update: 2015-11-04 07:22 GMT
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన రాజయ్య ఇంట్లో అగ్ని ప్రమాదంపై పలు ఆరోపణలు.. సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో.. ఆయన కోడలు సారిక.. ముగ్గురు మనమలు ఘటనాస్థలంలోనే మరణించారు. వీరి దేహాలు పూర్తిగా కాలిపోయాయని పోలీసులు చెబుతున్నారు. తనను తన అత్తమామలు సరిగా చూడలేదంటూ సారిక పలుమార్లు నిరసనలు చేపట్టారు. అంతేకాదు.. మూడు రోజుల క్రితం ఆరోపణలు ఉన్న తన మామకు వరంగల్ ఉప ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖ రాసినట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే రాజయ్య కుమారుడు అనిల్.. సారికల వ్యవహారం ప్రేమతో మొదలై.. చివరకు ఆమె అనుమానాస్పద రీతిలో మరణించటమే కాదు.. ముక్కుపచ్చలారని ముగ్గురు పిల్లలు దారుణంగా మరణించటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజయ్య కుమారుడు అనిల్.. సారికలది ప్రేమ వివాహంగా వారి సన్నిహితులు చెబుతున్నారు. 2002లో అనిల్ తో సారికకు పరిచయమైంది. 2006లో అనిల్ ఆమెను ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి విషయంలో రాజయ్య అస్సలు ఒప్పుకోలేదు. సారికది నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు.

అత్తమామల నుంచి ఆదరణ లేకపోవటంలో సారిక.. ఆమె భర్త ఇద్దరూ అమెరికాకు వెళ్లిపోయారు. ఆమె అక్కడ ఉద్యోగం చేస్తుండేది. అయితే.. అనిల్ మాత్రం ఖాళీగానే ఉండేవాడని చెబుతున్నారు. భార్య సంపాదిస్తుంటే.. అనిల్ మాత్రం జల్సాలు చేసేవాడని చెబుతుంటారు. కొన్నాళ్లకు అమెరికా నుంచి వచ్చిన తర్వాత కూడా సారికను రాజయ్య కుటుంబం ఒప్పుకోలేదు. దీంతో.. భర్తతో కలిసి హైదరాబాద్ నగరంలోని చిలకలగూడలో కాపురం ఉండేవారు. కొన్నాళ్లకు ఓకే చెప్పేసి యాదగిరి గుట్టలో పెళ్లి జరిపారు.

భర్తతో కలిసి వరంగల్ వచ్చేసిన తర్వాత అనిల్ వేరే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకోవటంపై ఆమె అగ్రహం వ్యక్తం చేసిందని చెబుతారు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవని ఇరుగుపొరుగు వారి మాట. దీనికి తోడు.. అనిల్ విషయంలో అతని తల్లిదండ్రులు రాజయ్య పెద్దగా వ్యతిరేకించకపోవటం మరిన్ని గొడవలకు కారణమైందని చెబుతారు. తనకు ఎవరూ సాయంగా నిలవకపోవటంతో అత్తమామలపై ఆమె పలుమార్లు కేసు పెట్టారు. ఇంటి నుంచి బయటకు వచ్చేస్తే ఇబ్బంది అన్న ఉద్దేశంతో రాజయ్య ఇంట్లోనే ఒక భాగంలో ఆమె ఉంటారని చెబుతారు.

తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ సారిక గతంలో కేసులతో పాటు.. నిరసనలకు దిగారు. కొన్ని కేసులు కోర్టు విచారణలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. గత రాత్రి ఇంట్లో భర్త అనిల్.. మామ రాజయ్య ఉన్నారని చెబుతున్నారు. రాత్రి పెద్ద గొడవ జరిగినట్లుగా ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. గ్యాస్ స్తంభం పెలితే పెద్ద శబ్దం రావాలని .. కానీ అలాంటిదేమీ లేకుండా నలుగురు మృతి చెందటం ఏమిటని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్ని ప్రాణంగా చూసుకునే సారిక.. పిల్లల్ని చంపుకొని.. తనకు తాను ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని చెబుతున్నారు. మొత్తంగా ప్రేమకథగా మొదలై.. చివరకు అనుమానాస్పద రీతిలో మృతి చెందటం పలువురిని కలిచి వేస్తోంది.
Tags:    

Similar News