అమ‌రావ‌తి డిజైన్లు..జ‌క్క‌న్న చివ‌రిద‌శ‌లో ఉన్నార‌ట‌

Update: 2017-12-11 04:14 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి డిజైన్ల విష‌యం కొలిక్కి వ‌స్తోంది. ఈ డిజైన్ల బాధ్య‌త చూస్తున్న నార్మ‌న్ ఫోస్ట‌ర్ సంస్థ కొద్దికాలం క్రితం కీల‌క‌మైన రాజధాని పరిపాలనా నగరం వ్యూహ డిజైన్‌ తోపాటు అసెంబ్లీ - హైకోర్టు - సచివాలయం డిజైన్లు రూపొందించి ఇచ్చిన‌ప్ప‌టికీ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వాటి ప‌ట్ల సంతృప్తి వ్యక్తం చేయ‌ని సంగ‌తి తెలిసిందే. వజ్రాకృతి - స్థూపాకృతి డిజైన్లను ఖరారు చేసే ద‌శ‌లో వాటికి నో చెప్పి సినీ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని రంగంలోకి దింపి ఆయ‌న సల‌హా ప్ర‌కారం డిజైన్లు ఇవ్వాల‌ని ప్రభుత్వం నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థను ఆదేశించింది. ఈ క‌స‌ర‌త్తు ముగిసిన అనంత‌రం స‌ద‌రు సంస్థ ఇచ్చిన డిజైన్ల‌పై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి చ‌ర్చించారు.

ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి నారా  చంద్ర‌బాబు నాయుడు త‌న వ్య‌క్తిగ‌త ఫేస్‌ బుక్ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. `రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిపాలన నగరం - శాసనసభ నిర్మాణాలపై సీఆర్‌‌ డీఏ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాము. ఫోస్టర్ అండ్ పార్టనర్స్ రూపొందించిన పలు ఆకృతులపై దర్శకుడు ఎస్‌ ఎస్ రాజమౌళి ప్రెజెంటేషన్ ఇచ్చారు.‬` అని ఆయ‌న వివ‌రించారు. కాగా, ఏపీ ప్ర‌భుత్వం ఆదేశాలు - రాజ‌మౌళి స‌ల‌హాల నేప‌థ్యంలో నార్మ‌న్ ఫోస్ట‌ర్ సంస్థ మ‌రో 13 డిజైన్ల‌ను రూపొందించింది. వాటిని సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసి ప్ర‌జ‌ల అభిప్రాయం కోరింది. ఫేస్‌ బుక్ - ట్విట్టర్‌ తో పాటు సీఆర్‌ డీఏ వెబ్‌ సైట్‌ లో పెట్టిన‌ నార్మ‌న్ ఫోస్ట‌ర్ సంస్థ ప్ర‌తినిధులు వారంపాటు ప్రజల అభిప్రాయాలు స్వీకరించారు. అనంత‌రం తాజా డిజైన్లు రూపొందించి వాటిని ప్ర‌భుత్వానికి అందించారు. తాజాగా వాటిపైనే రాజ‌మౌళి - చంద్ర‌బాబు - సీఆర్‌ డీఏ అధికారులు చ‌ర్చించారు.

కాగా, న‌వ్యాంధ్ర‌ప్రదేశ్ రాజ‌ధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దనున్నట్లు ప్ర‌క‌టిస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఈ క్ర‌మంలో రాజమౌళిని భాగ‌స్వామ్యం పంచుకోవాల‌ని కోరింది. అమ‌రావ‌తి నిర్మాణానికి సలహాలివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను అభ్యర్థించారు. రాజమౌళి నిర్మించిన బాహుబలి - అంతకుముందు మగధీర భారీ సినిమాల్లో అత్యంత ఆకర్షణీయమైన నగరాలను చూపించిన వైనం బాబును ఆకట్టుకుంది. అలాంటి తరహాలో నగర నిర్మాణానికి సూచన - సలహాలివ్వాలని బాబు ఆయనను కోరడమే కాకుండా, రాజమౌళి వద్దకు మంత్రి నారాయణ - సీఆర్‌ డీఏ కమిషనర్ చెరుకూరు శ్రీ‌ధ‌ర్‌ ను పంపారు. వారిద్దరూ బాహుబలి - మగధీరలో చూపించిన నగర నిర్మాణాల డిజైన్లపై చర్చించారు. వాటితోపాటు పురాతన కాలం నాటి నిర్మాణాలపైనా ఆసక్తి ప్రదర్శించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న అమరావతి నిర్మాణంలో తెలుగు సంస్కృతి - సంప్రదాయం - చరిత్ర ఉట్టిపడేలా ఉండాలని ముఖ్యమంత్రి ఆశిస్తున్నందున, ఆ మేరకు మీ సహకారం కావాలని వారు అభ్యర్ధించారు. అందుకు స్పందించిన రాజమౌళి అమరావతి డిజైనర్లకు తన సహకారం తప్పకుండా అందిస్తానని, అంత ప్రతిష్ఠాత్మకమైన నగరానికి తన సలహాలు కోరినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

అనంత‌రం సీఆర్డీఏ ప్ర‌తినిధులు - ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో స‌హా రాజ‌మౌళి లండ‌న్ వెళ్లివ‌చ్చారు. అక్క‌డ డిజైన్ల‌పై త‌న అభిప్రాయాలు వెల్ల‌డించి ఆ త‌దుప‌రి ద‌శ‌లో ఫోస్ట‌ర్ ఇచ్చిన డిజైన్ల‌పై తాజాగా చంద్ర‌బాబుతో జ‌క్క‌న్న చ‌ర్చించారు. త్వ‌ర‌లో డిజైన్ల‌పై పూర్తి స్ప‌ష్ట‌త రానుంద‌ని తెలుస్తోంది.

రాజమౌళి పక్కనే ఆయన  కుమారుడు కార్తికేయ కూడా ఉన్నారు. రాజధాని డిజైన్ల నిర్ణయం పని రాజమౌళికి చంద్రబాబు అప్పగించగా, అందులో కార్తికేయ తండ్రికి సహకరించినట్లు భావిస్తున్నారు. అయితే... అంతవరకు బాగానే ఉన్నా ఆయన ఏకంగా సీఆర్డీయే సమావేశంలో పాల్గొనడమే విమర్శలకు తావిస్తోంది.

నిజానికి సినిమా ప్రొడ్యూసర్ గా కెరీర్ సాగిస్తున్న కార్తికేయను ఈ సమావేశానికి తేవాల్సిన అవసరం ఏమాత్రం కనిపించడం లేదు. రాజమౌళి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం, లేదంటే ఆయన చేసిన అధ్యయనం వెనుకో కార్తికేయ ఉంటే ఉండొచ్చు కానీ అలా అని ఏకంగా అత్యున్నత అధికారిక సమావేశానికి ఏ సంబంధం లేని వ్యక్తిని తేవడం అవసరం లేదన్న భావనే అందరి నుంచీ వినిపిస్తోంది.
Tags:    

Similar News