ఇలాంటి అతిధ్యం రాజమండ్రికే సాధ్యం

Update: 2015-07-19 04:37 GMT
గోదావరి పుష్కరాలన్న వెంటనే గుర్తుకు వచ్చే ఊరు రాజమండ్రే. ఇప్పుడంటే పరిస్థితుల్లో మార్పు వచ్చాయి కానీ.. పాతికేళ్ల కింద గోదావరి పుష్కరాలు అంటే చాలు.. జనాలు అత్యధికం రాజమండ్రికి ప్రయాణాలు కట్టేవారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి తీర ప్రాంతం చాలానే ఉన్నా.. పుష్కర స్నానం అంటే రాజమండ్రిలోనే చేయాలనే భావన చాలామందిలో ఇప్పటికి ఉంది.

అప్యాయతలకు మారుపేరుగా చెప్పుకునే ఉభయ గోదావరి జిల్లాల్లో.. పుష్కరాల సందర్భంగా మరే ఊరులోనూ కనిపించని ప్రత్యేక వాతావరణం రాజమండ్రిలో కనిపించటం విశేషం. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రగిరికి వచ్చే భక్త జనులకు ప్రతి ఒక్క రాజమండ్రి వాసి మర్యాదలు చేయాలని.. రోజులో ఒక్క గంట అయినా సరే.. అతిధ్యానికి సమయం కేటాయించాలని.. భక్తులకు కనీసం గ్లాసు మంచినీళ్లు అయినా ఇస్తే.. అదో గొప్పగా చెప్పుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలతో పాటు.. తర తరాలుగా గోదావరి పుష్కరాల సమయంలో.. గోదారి తల్లి వద్దకు వచ్చే భక్తుల అవసరాలు తీర్చే రాజమండ్రి వాసులు తాజాగా మరోసారి స్పందించారు.

అది కూడా ఏ స్థాయిలో అంటే.. దాదాపుగా ప్రతి ఇంటి ముందు కనీసం మంచినీళ్లు ఇవ్వటం.. మజ్జిగ.. పులిహోర.. పెరుగన్నం లాంటివి ఇవ్వటం కనిపిస్తోంది. పెద్దలతో పాటు.. పిల్లలు.. దారిన వెళ్లే భక్తులకు వీటిని అందిస్తూ భక్త జనుల మనసుల్ని దోచుకుంటున్నారు. ఇలాంటి మర్యాద మరే ఊరికి ఉండదన్న మాట రాజమండ్రి వాసుల అతిధ్యం చూస్తున్న వారు చెబుతున్నారు. సౌకర్యాలు పరిమితంగా ఉండే కాలంలోనూ.. గోదావరి పుష్కరాలు వస్తున్నాయంటే.. మూడు నెలలకు సరిపడా.. కిరాణ సామాను ఇంటికి తీసుకొచ్చి.. పదిహేను రోజుల ముందునుంచే పిండివంటలు సిద్ధం చేసి.. బంధుమిత్రులకు సపర్యలు చేసే రాజమండ్రి వాసులు.. కాలం మారినా తమ అతిధ్య గుణాన్ని మరింత విస్తరించటం గొప్పే.
Tags:    

Similar News