ఏడు కొండల్నిపిండి చేసి 40కిమీ రోడ్డేసిన టీచర్

Update: 2015-08-25 04:15 GMT
ఇప్పుడు దేశవ్యాప్తంగా మాంఝీ పేరు మారుమోగుతోంది. ఊరికి శాపంగా మారిన కొండ కారణంగా తన భార్యతో సహా పలువురి ప్రాణాల్ని బలి తీసుకున్న కొండపై కోపంతో.. దాన్ని కరిగించి.. రోడ్డు వేసి.. 55 కిలోమీటర్ల దూరాన్ని 15 కిలోమీటర్లు తగ్గించిన వ్యక్తి ఉదంతాన్ని సినిమా తీయటంతో ఆయన ప్రయత్నం అందరికి తెలిసిందే.

అయితే..  మాంఝీ కంటే మొనగాడైన మరో టీచర్ ఉదంతం ఇప్పుడే బయటకు వచ్చింది. మహారాష్ట్రకు చెందిన ఈ మాంఝీ చేసిన కృషి పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు. ఇతగాడు తన ప్రయత్నంతో 57 ఏళ్ల పాటు శ్రమించి దాదాపు 40 కిలోమీటర్ల రోడ్డు నిర్మించాడు. ఇందుకోసం ఏడు కొండల్ని పిండి చేసి.. బాట వేసి.. తన గ్రామానికి కొత్త దారి అందించాడు.

మహారాష్ట్రలోని గుండె గావ్ కు చెందిన రాజారాం భాష్కర్ ఊరికి అడ్డుగా ఏడు కొండలున్నాయి. ఆ ఊరి నుంచి కోలె గావ్ కు వెళ్లాలంటే ఈ కొండలు అడ్డుగా నిలిచేవి. దీంతో.. ఆ ఊరి వారంతా 29 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఫలితం దక్కని దుస్థితి. దీంతో.. తన చిన్నానాటి కోరికను తీర్చుకునేందుకు ఆయన నడుం బిగించాడు.

టీచరుగా ఉన్నప్పటికీ.. ఆయన తనకు వచ్చిన జీతంలో ఎక్కువ భాగంగా.. కొండను కరిగించి.. రోడ్డు వేయటానికే ఖర్చు చేశారు. ఇలా ఆయన 57 ఏళ్లు శ్రమించి దాదాపు 40 కిలోమీటర్ల రోడ్డును నిర్మించారు. 700 మీటర్ల ఎత్తున్న కొండను పిండి చేసిన అతగాడు.. ఈ రోడ్డు కోసం తన ఆదాయాన్ని..  ఆస్తుల్ని పణంగా పెట్టాడు. ఒక కొండను తవ్విన మాంఝీ మౌంటెన్ మ్యాన్ గా మారితే.. ఏడు కొండల్ని పిండి చేసి.. 40 కిలోమీటర్ల మేర రోడ్డు వేసిన రాజారాం భాష్కర్ ను ఏమనాలి..?
Tags:    

Similar News