తెరాస‌లోకి బీజేపీ ఎమ్మెల్యే..!

Update: 2015-12-03 11:35 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారు...గ్రేట‌ర్ పీఠంపై గులాబి జెండా ఎగ‌ర‌వేసేందుకు ఆయ‌న వేస్తున్న ఎత్తులు...ప‌న్న‌తున్న వ్యూహాలు ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. నిన్న‌టి వ‌ర‌కు ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌ - టీడీపీ ఎమ్మెల్యేల‌పై ఆక‌ర్ష్ వ‌ల‌వేసి వారిని మాత్ర‌మే పార్టీలో చేర్చుకున్న ఆయ‌న ఇప్పుడు ఏకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే షాక్ ఇవ్వ‌నున్నారా అంటే అవున‌నే స‌మాధానం తెలంగాణ పొలిటిక‌ల్ కారిడార్ లో వినిపిస్తోంది. బీజేపీ నాయ‌కులు కూడా ఇది నిజ‌మ‌నే అంటున్నారు.

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు కిష‌న్‌ రెడ్డిపై అసంతృప్తి బావుటా ఎగ‌ర‌వేసి...బ‌హిరంగంగానే త‌న అసంతృప్తి వ్య‌క్తం చేసిన గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ తదుపరి వ్యూహంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన త్వరలోనే తెరాస‌లో చేర‌తార‌ని బీజేపీ నాయ‌కులు ఒక అంచ‌నాకు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. కేసీఆర్ వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌లో భాగంగానే ఆయ‌న కిష‌న్‌ రెడ్డి పై విరుచుకుప‌డ్డార‌ని...త్వ‌ర‌లోనే ఆయ‌న గులాబి కండువా క‌ప్పుకుంటార‌ని తెలుస్తోంది.

వరంగల్ లోక్‌ సభ ఉపఎన్నికలో ఎవ్వ‌రూ ఊహించ‌ని మెజార్టీ సాధించిన తెరాస ఇప్పుడు గ్రేట‌ర్ పీఠంపై దృష్టి పెట్టింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కూడా ఆ పార్టీ తిరుగులేని విజ‌యం సాధిస్తుంద‌న్న సంకేతాలు వెలువ‌డుతున్న నేప‌థ్యంలో ఇప్పుడు గ్రేట‌ర్‌ లో కూడా ఘ‌న‌విజ‌యం సాధించి తామేంటో స‌త్తా చాటాల‌ని భావిస్తున్నారు. వాస్త‌వానికి ద‌క్షిణాది ఓట‌ర్ల‌తో పాటు సెటిల‌ర్స్ ఎక్కువ‌గా ఉన్న గ్రేట‌ర్‌ లో తెరాస విజ‌యం న‌ల్లేరుమీద న‌డ‌క‌కాద‌ని ముందునుంచి విశ్లేష‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీ ఎమ్మెల్యేనే చేర్చుకుంటే త‌మ‌కు మ‌రింత బ‌లం చేకూరుతుంద‌న్న అంచ‌నాల్లో తెరాస నేత‌లు మునిగి తేలుతున్నారు.

గురువారం టీడీపీకి చెందిన కంటెన్మెంట్ ఎమ్మెల్యే సాయ‌న్న‌ - కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ సీఎం కేసీఆర్‌ ను కలిసి తెరాస‌లో చేరారు. ఈ సంఘ‌ట‌న‌కు క‌రెక్టుగా ఒకరోజు ముందు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కిష‌న్‌ రెడ్డి తీరును దుయ్య‌బ‌ట్ట‌డం.....  అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేయడం చూస్తే ఇదంతా ప్లాన్ ప్ర‌కార‌మే జ‌రిగింద‌ని...రాజాసింగ్ తెరాస‌లోకి వెళ్లేందుకే ఇలాంటి విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని బీజేపీ నేత‌లు కూడా ప‌రోక్షంగా అంగీక‌రిస్తున్నారు. ఈ ప‌రిణామంతో షాక్‌కు గురైన బీజేపీ నాయ‌కులు గురువారం  స‌మావేశ‌మై రాజాసింగ్ వ్యాఖ్య‌ల‌పై చ‌ర్చించారు. ఈ విష‌యాన్ని బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం దృష్టికి కూడా తీసుకెళ్లాలని రాష్ర్ట నాయ‌కులు డిసైడ‌య్యారు. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ స‌మావేశంలో కూడా ఈ అంశంపై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్.రామచంద్రరావు ఇప్పటికే ప్రకటించారు. ఏదేమైనా కేసీఆర్ రాజాసింగ్‌ ను చాలా వ్యూహాత్మ‌కంగా తెరాస‌లో చేర్చుకుంటున్నార‌న్న టాక్ వ‌స్తోంది. త్వ‌ర‌లోనే గ్రేట‌ర్ నోటిఫికేష‌న్ వ‌స్తుండ‌డంతో రాజాసింగ్ కూడా గులాబి గూటికి చేరిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.
Tags:    

Similar News