మీరేం రాయాల‌న్న స‌ర్కారు అనుమ‌తి త‌ప్పనిస‌రి

Update: 2017-10-24 09:10 GMT
బీజేపీ పాలిత రాజస్థాన్ ప్రభుత్వం వివాదంలో చిక్కుకుంది. నేర చట్టాల సవరణ బిల్లు-2017ను అసెంబ్లీలో ఆ రాష్ట్ర ప్ర‌వేశ‌పెట్ట‌డం  వివాదాస్పదంగా మారింది. సెప్టెంబర్ 7వ తేదీన తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును రూపొందించారు. దీని ప్రకారం రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు - జడ్జీలు - మాజీ న్యాయమూర్తులు - అధికారుల నేరారోపణలపై దర్యాప్తు చేయాలంటే ముందస్తుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా వారిపై కోర్టుల్లో కేసులు వేయడాన్ని నేరంగా పరిగణిస్తారు. దానికి సంబంధించిన వార్తలను రాసే జర్నలిస్టులు - మీడియా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటారు. బాధ్యులకు రెండేళ్ల‌ వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది.

అయితే ఈ బిల్లుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అయినా వసుంధర రాజే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో హోంశాఖ మంత్రి గులాబ్‌ చంద్ కటారియా బిల్లును ప్రవేశపెట్టారు. స్వతంత్ర ఎమ్మెల్యే మానిక్ చంద్ ఈ బిల్లును నల్ల చట్టంగా అభివర్ణించారు. ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని విధిస్తున్నదని ఆరోపించారు. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ - నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) సభ్యులు వాకౌట్ చేశారు. ఈ బిల్లును అధికార బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లు ప్రజల ప్రాథమిక హక్కులను హరిస్తున్నదని, అవినీతిపరులైన ప్రజాప్రతినిధులు, అధికారులను కాపాడుకునేందుకే దీనిని తీసుకొచ్చారని బీజేపీ ఎమ్మెల్యేలు ఘనశ్యామ్ తివారి - నర్పత్ సింగ్ రజ్వీ విమర్శించారు. బిల్లుపై ప్రశ్నించేందుకు అనుమతి కోరగా స్పీకర్ నిరాకరించడంతో రెండుసార్లు వాకౌట్ చేశారు.

రాజస్థాన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రమాదకరమైన బిల్లును వెంటనే వెనుకకు తీసుకోవాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. ఈ బిల్లు ప్రజాప్రతినిధులను - అధికారులను - జడ్జిలను తప్పుడు కేసుల నుంచి కాపాడుతున్నట్టు కనిపించినా - నిజానికి మీడియాను వేధించే ప్రధానాస్త్రంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. బిల్లుపై పునరాలోచించాలని రాజస్థాన్ ప్రభుత్వానికి సూచించారు. రాజస్థాన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ అడ్వకేట్ అజయ్‌ జైన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ బిల్లు మీడియా స్వేచ్ఛను హరించడంతోపాటు - న్యాయవ్యవస్థ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఈ బిల్లు నాశనం చేస్తున్నదని పేర్కొన్నారు.
 
వసుంధర రాజే ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు పూర్తి విరుద్ధమని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. మీడియా స్వేచ్ఛను హరించడంతోపాటు - ప్రజల తెలుసుకొనే హక్కును కాలరాయడమేనని చెప్తున్నారు. మీడియాపై ఆంక్షలు అంశంపై 2012లో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మీడియా నియంత్రణ భావనను ఐదుగురు సభ్యుల ధర్మాసనం పూర్తిగా వ్యతిరేకించింది. ఏ వార్తలు మాత్రమే రావాలో నిర్దిష్టంగా మార్గదర్శకాలు రూపొందించలేమని స్పష్టం చేసింది. మీడియా స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా అభివర్ణించింది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం లక్ష్మణ రేఖ గీసింది. వార్తల వల్ల పరువుకు భంగం కలిగిందని భావిస్తే బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని తెలిపింది. రాజస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు సుప్రీంకోర్టు మార్గదర్శకాల్ని తుంగలో తొక్కేదిగా ఉందని అంటున్నారు.
Tags:    

Similar News