ఇదెక్కడి ఫేక్ రా బాబు.. బాలయ్యకు రజనీ బొకే

Update: 2022-08-19 04:23 GMT
ఏపీలో రాజకీయం చూస్తుంటే.. హద్దులు దాటేసిన పైత్యం అధికార.. విపక్షాలకు నిండుగా పట్టేసిందని చెప్పాలి. ఎవరికి వారు తగ్గేదెలే అన్నట్లుగా వ్యవహరిస్తూ.. దుమ్మెత్తిపోసుకోవటం రోజువారీ కార్యక్రమంగా మారింది. ఈ విషయంలో నిందించాల్సి వస్తే దానికి ముందుగా అధికార వైసీపీవైపే వేలెత్తి చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. సోషల్ మీడియాతో తమ రాజకీయ ప్రత్యర్థుల్ని ఆడుకోవటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తర్వాతే ఎవరైనా.  మీరు రెండు ఆకులు తింటే మేం నాలుగు ఆకులు తినమా? అన్నట్లుగా తెలుగు తమ్ముళ్లు కూడా కొంత మేర చెలరేగిపోతున్న పరిస్థితి.

నిజానికి సోషల్ మీడియా సాక్షిగా హద్దులు దాటేసి మాటలు అనుకోవటం.. దెబ్బ తీయటం కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. గీతలు దాటేసే తీరు.. మార్ఫింగ్ లతో నానా యాగీ చేయటం లాంటివి ఇటీవల కాలంలో మరింత ఎక్కువ అయ్యాయి.

ఇలాంటివి అచ్చంగా ఆయా పార్టీలు చేస్తున్నాయని చెప్పటం సరికాదు. పార్టీల హార్డ్ కోర్ ఫ్యాన్స్ రంగంలోకి దిగి ఇలాంటి వాటికి తెర తీస్తున్నారు.మొన్నటికి మొన్న వైసీపీ సోషల్ మీడియాను చూసే ముఖ్యుడు ఒకరు తన సోషల్ మీడియా ఖాతాలో.. ఎన్టీఆర్ కుమార్తె మరణంపై పెట్టిన పోస్టు షాకింగ్ గా మారింది.

పూర్తిగా అబద్ధాలు.. అసత్యాలతో కూడిన ఈ పోస్టు చూసినప్పుడు ఇదెక్కడి బరితెగింపు అని అనుకోకుండా ఉండలేం. జూబ్లీహిల్స్ లోని వందల కోట్లు విలువ చేసే భూమి విషయంలో లోకేశ్.. కు చిన్నమ్మకు జరిగిన రచ్చ.. ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా వండేసిన వంటలో షాకింగ్ ట్విస్టు ఏమంటే.. ఆ పోస్టులో పేర్కొన్న సర్వే నెంబరు జూబ్లీహిల్స్ పరిధిలో లేకపోవటం.

ఇలాంటి అబద్ధాలు నిజాలుగా చెలామణి కావటం.. వాటి కారణంగా తమ ఇమేజ్ కు అంటిన బురదను శుభ్రం చేసుకునేసరికి కిందా మీదా పడుతున్న పరిస్థితి.

ఇదిలా ఉంటే తాజాగా ఏపీ మంత్రి విడుదల రజనీ వెళ్లి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణకు పూల బొకే ఇచ్చిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వాస్తవం ఏమంటే.. కొద్ది రోజుల క్రితం వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డిని మంత్రివిడుదల రజనీ మర్యాదపూర్వకంగా కలిసిన ఫోటోను.. ఎవరో అతిగాళ్లు తల భాగంలో  విజయసాయికి బదులుగా బాలక్రిష్ణ ఫోటోను మార్ఫింగ్ చేసి వైరల్ చేసుకుంటున్న తీరు చూస్తే.. కచ్ఛితంగా ఇదెక్కడి అతిరా నాయనా? అనుకోకుండా ఉండలేం. ఇలాంటివి ఎక్కువ అవుతున్న కొద్దీ.. వీటిని తయారు చేసే వారి కంటే.. వారు ఎంతగానో అభిమానించే పార్టీలకు భారీ నష్టం కలుగుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
Tags:    

Similar News