పాలిటిక్స్ లోకి సూపర్ స్టార్..?

Update: 2017-02-06 04:29 GMT
ఏళ్లకు ఏళ్లుగా తమిళనాట నానుతున్న ఏదైనా మాట ఉందంటే.. అది సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించే. ఇదిగో ఆయన రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు.. అదిగో ఆయన రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారన్నమాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. పాలిటిక్స్ లోకి వచ్చే విషయంలో ఆయనో అడుగు ముందుకు వేసినట్లుగా వార్తలు వచ్చేసి.. అంతలోనే వెనక్కి తగ్గినట్లుగా ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి రజనీ రాజకీయ రంగ ప్రవేశం గురించి జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ జరిగింది వేరని..ఈసారి అందుకు భిన్నంగా జరిగే అవకాశం ఉందని పలువురు బలంగా చెబుతున్నారు. తమిళ మీడియాలోనూ రజనీ పొలిటికల్ ఎంట్రీ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

దీనికి తోడు.. తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన రజనీకాంత్ తనకు పవర్ అంటే ఇష్టమని చెప్పి.. అది అధ్యాత్మికతలో ఉందని చెప్పటం కొత్త చర్చకు అవకాశం ఇచ్చింది. తమిళనాడు మీడియా అంచనాల ప్రకారం రజనీ రాజకీయ రంగప్రవేశం కోసం బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు. బీజేపీ మద్దతుతో సూపర్ స్టార్ రాజకీయ రంగప్రవేశం ఉంటుందని.. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల పట్ల రజనీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ వార్తలకు తగ్గట్లే సోషల్ మీడియాలోనూ రజనీ రాజకీయ రంగప్రవేశం గురించి జోరుగా పోస్టింగులు కనిపిస్తుండటం గమనార్హం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో రజనీ రాజకీయాల్లోకి రావాలని.. అది తప్పనిసరన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి 2014 సార్వత్రిక ఎన్నికల వేళలో.. నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ చెన్నైకి వచ్చి.. రజనీకాంత్ ఇంటికి వెళ్లి మరీ రాజకీయాల్లోకి రావాల్సిందిగా కోరినా.. అప్పట్లో అది సాకారం కాలేదు. అమ్మ మరణం.. కరుణ అనారోగ్యం తదితర కారణాల నేపథ్యంలో.. ప్రజల్లో బలమైన ఆదరణ ఉన్న రజనీకాంత్ కానీ రాజకీయాల్లోకి వస్తే..తమిళనాడులో కొత్త శకం ప్రారంభం కావటమే కాదు.. ఆ రాష్ట్రంలో పాగా వేయాలన్న బీజేపీ సుదీర్ఘ స్వప్నం సాకారం అవుతుందన్న అంచనా వ్యక్తమవుతోంది. మరి.. అందుకు సూపర్ స్టార్ ఏమంటారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News