రజనీ అరంగేట్రానికి రంగం సిద్ధం

Update: 2018-10-21 12:12 GMT
రజనీకాంత్ దక్షిణాదిన అతి పెద్ద స్టార్‌గా అవతరించి రెండు దశాబ్దాలవుతోంది. ఆయన కంటే చిన్న స్థాయి హీరోలెందరో రాజకీయాల్లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో రజనీ రాజకీయారంగేట్రం కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఒక దశలో ఫ్యాన్స్ తీవ్ర ఒత్తిడి తెచ్చారు రజనీ మీద. ఆయన మాత్రం ఏ విషయం తేల్చకుండా ఏళ్లకు ఏళ్లు గడిపేశారు. ఒక దశలో ఇక రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదన్నట్లుగా కనిపించారు. కానీ జయలలిత మరణం తర్వాత రజనీ ఆలోచనలు మారాయి. కరుణానిధి కూడా జీవిత చరమాంకానికి చేరుకోవడం వల్ల తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడటంతో రజనీలో ఆశలు పుట్టాయి. తాను పార్టీ పెట్టబోతున్నట్లు.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు గత ఏడాదే ప్రకటించారు రజనీ.

కానీ ఈ ప్రకటన తర్వాత రజనీ పెద్దగా చేసిందేమీ లేదు. పార్టీ మొదలుపెట్టే పనిని వాయిదా వేస్తూ వస్తున్నారు. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. సినిమాల్లోనే బిజీగా ఉంటూ వచ్చారు సూపర్ స్టార్. ఐతే ఎట్టకేలకు రజనీ సినిమాలకు సెలవిచ్చేసి ఇక రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లే కనిపిస్తోంది. డిసెంబరు 12న తన పుట్టిన రోజు సందర్భంగా రజనీ కొత్త పార్టీని ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తాను మొదలుపెట్టిన కొత్త సినిమాను శరవేగంగా నాలుగు నెలల్లోనే పూర్తి చేశారు రజనీ. ఈ సినిమా షూటింగ్ ముగిసినట్లు విజయ దశమి రోజు ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇక డబ్బింగ్ పని మాత్రమే మిగిలి ఉంది. అది కూడా కొన్ని రోజుల్లో ముగుస్తుంది. నవంబరు నెలాఖర్లో ‘2.0’ ప్రమోషన్లలో పాల్గొంటారు. మధ్యలో పార్టీ పనులు కూడా సమాంతరంగా నడుస్తుంటాయి. పుట్టిన రోజు నాడు పార్టీని ప్రకటించి ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెడతారట సూపర్ స్టార్.

Tags:    

Similar News