ఢిల్లీ అల్లర్లపై కేంద్రానికి తలైవా సూటి ప్రశ్న

Update: 2020-02-26 16:17 GMT
ఈశాన్య ఢిల్లీలోని జఫ్రాబాద్ - మౌజ్‌ పూర్ - చాంద్‌ బాగ్ - భజన్‌ పుర ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. సీఏఏ అనుకూల - వ్యతిరేక వర్గాల మధ్య ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వుకుంటూ హింసకు దిగడంతో పలు దుకాణాలు - ప్రభుత్వాస్తులు ధ్వంసమయ్యాయి. 2 రోజుల పాటు జరిగిన ఈ అల్లర్లు, హింసాకాండలో ఒక హెడ్ కానిస్టేబుల్ - ఇంటెలిజెన్స్ అధికారి సహా 23 మంది వరకూ మృతి చెందారు. మరో150 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ అల్లర్లకు బీజేపీ నేతలే కారణమంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా, ఈ అల్లర్లపై తమిళ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లకు కేంద్ర హోంశాఖదే బాధ్యతంటూ తలైవా షాకింగ్ కామెంట్స్ చేశారు.

సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న సమయంలో నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని రజనీకాంత్ ప్రశ్నించారు. హోంశాఖ - నిఘా వర్గాల వైఫల్యం వల్లే ఢిల్లీలో ఘర్షణలు పేట్రేగిపోయాయని రజనీ సంచలన ఆరోపణలు చేశారు. సకాలంలో కేంద్ర హోం శాఖ - నిఘా వర్గాలు స్పందించి ఉంటే ప్రాణనష్టం - ఆస్తి నష్టం జరిగి ఉండేది కాదని తలైవా అభిప్రాయపడ్డారు. అయితే, ఆందోళనకారులు హింస చెలరేగేలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని రజనీ అన్నారు. తాను బీజేపీకి మద్దతిస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు - రాజకీయ విశ్లేషకులు చేస్తోన్న ప్రచారాన్ని తలైవా ఖండించారు. తనకు బీజేపీతో సంబంధాలున్నాయని ప్రచారం చేయడం సరికాదని తలైవా అన్నారు.

కాగా,  సీఏఏపై ర‌జ‌నీకాంత్ గతంలో చేసిన వ్యాఖ్య‌లు త‌మిళ‌నాట దుమారం రేపిన సంగతి తెలిసిందే. సీఏఏను తాను స‌మ‌ర్థిస్తున్నాన‌ని చెప్పిన ర‌జ‌నీ - సీఏఏతో ముస్లింలు - ముస్లిమేత‌రులలో ఏ ఒక్క‌రికి నష్టం కలిగినా వారికి అండగా తాను పోరాడతానని అన్నారు. సీఏఏ వల్ల ఎవరికీ నష్టం జరిగిన ప‌క్షంలో వారి త‌ర‌ఫున తాను ఆందోళనకు దిగుతానని త‌లైవా చెప్పారు. సీఏఏపై తప్పుడు సమాచారంతో ప్రజలను తమిళ నేతలు రెచ్చగొడుతున్నారని ర‌జ‌నీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ర‌జ‌నీకాంత్ బీజేపీకి అనుకూల‌మ‌ని, ర‌జనీ వ్యాఖ్య‌ల వెనుక బీజేపీ నేతలున్నార‌ని కాంగ్రెస్ నేత‌ చిదంబరం - ఆయన తనయుడు కార్తీ చిదంబరం - డిఎంకే నేతలు స్టాలిన్ - అళగిరి విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే, తాజాగా కేంద్రం హోం శాఖపై రజనీ చేసిన వ్యాఖ్యలతో గతంలో అన్న మాటలకు ఆయన కట్టుబడి ఉన్నట్లేనని ఆయన అభిమానులు అంటున్నారు.



Tags:    

Similar News