క‌విత‌ను పొగిడేసిన కేంద్ర మంత్రి

Update: 2016-09-02 16:31 GMT
కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు - టీఆర్‌ ఎస్ ఎంపీ కవితను పొగిడేశారు. నిరుద్యోగుల కోసం స్కిల్ డెవలప్‌ మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణలో తెలంగాణ జాగృతి దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. అశోక్‌ నగర్‌ లో స్కిల్ డెవలప్‌ మెంట్ సెంటర్‌ ను కేంద్ర మంత్రి రాజీవ్‌ ప్రతాప్ రూడీ - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి హోదాలో ఎంపీ కవిత ప్రారంభించారు. బహిరంగ సభలో కవితపై గవర్నర్ నరసింహన్ - కేంద్ర మంత్రులు రాజీవ్ ప్రతాప్‌ రూడీ - బండారు దత్తాత్రేయతో పాటు ఎంపీలు ప్రశంసలు కురిపించారు. స్కిల్ డెవలప్‌ మెంట్ సెంటర్‌ ను ఏర్పాటు చేయడం శుభపరిణామమని కొనియాడారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కవిత కృషి అభినందనీయమన్నారు.

స్కిల్ డెవలప్‌ మెంట్ సెంటర్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడారు. స్కిల్ ఇండియా మిషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ను ముందుకు తీసుకుపోవ‌డంలో కవిత కృషి ప్రశంసనీయమన్నారు. దేశంలో మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేక శాఖను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. నైపుణ్యత లేక బీటెక్ విద్యార్థులకు రూ. 5 వేల వేతనం ఉన్న ఉద్యోగం కూడా రావడం లేదన్నారు. ఐటీఐ విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యత బీటెక్ విద్యార్థుల్లో లేదన్నారు. సమాజంలో ఒక వెల్డర్ ఎన్నో రకాల పనులు నిర్వర్తిస్తున్నారని గుర్తు చేశారు. కానీ వెల్డర్లలో ఉన్నతస్థాయి అధికారి కంటే ఎక్కువ సంపాదించే వారున్నారని చెప్పారు. వెల్డర్లకు సమున్నత గౌరవం దక్కట్లేదన్నారు. జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతకు చక్కని నైపుణ్య శిక్షణ అందుతుందని తెలిపారు. యువతకు నైపుణ్యతలో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం అభినందనీయమని రూడీ పేర్కొన్నారు. దేశంలో మొదటి సారిగా కేంద్ర ప్రభుత్వం స్కిల్‌డెవలప్‌మెంట్‌ కోసం ప్రత్యేక శాఖను తీసుకువచ్చిందని కేంద్రమంత్రి రాజీవ్‌ ప్రతాప్‌రూడీ అన్నారు. ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించాలని పిలుపునిచ్చారు. యువతలో స్కిల్స్‌ పెంపొందించేందుకు రూ.32వేల కోట్లు కేటాయిస్తున్నామన్నారు. మానవ వనరులను అభివృద్ధి చేసుకున్నప్పుడే నిజమైన అభివృద్ధి. యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనే అసలైన అభివృద్ధి ఎంపీ కవిత అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పలు రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ జాగృతి నడుం బిగించిందని తెలిపారు. దాదాపు లక్ష మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో జాగృతి స్కిల్ డెవలప్‌ మెంట్ ప్రొగ్రాం డిజైన్ చేసింద‌ని వివ‌రించారు.
Tags:    

Similar News