బాబు ఉప‌న్యాసానికి బ్రేకులేసిన హోంమంత్రి

Update: 2018-06-17 07:29 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఢిల్లీలో అనూహ్య‌మైన ట్విస్ట్ ఎదురైంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ నాలుగో పాలకమండలి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు - పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు - ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్షరక్రమం ప్రకారం ముందుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అవకాశం ఇచ్చారు. అయితే బాబు ఎక్కువ స‌మ‌యం తీసుకుంటుండ‌టంతో...బ్రేక్‌ ప‌డింది.చంద్రబాబు ప్రసంగాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ అడ్డుకున్నారు.

రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ఆన్‌ లైన్ వ్యవసాయ మార్కెటింగ్ - ఆరోగ్య సంరక్షణ -ఆయుష్మాన్ భారతి - ప్రధానమంత్రి రాష్ట్రీయ సత్య సురక్ష మిషన్ - పోషణ్ మిషన్ - మిషన్ ఇంద్రధనుష్ - మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం తదితర అంశాలపైనా చర్చ జరుగనుది. ఈ క్ర‌మంలో అక్ష‌ర‌క్ర‌మం ప్ర‌కారం చంద్ర‌బాబుకు ముందు అవ‌కాశం వ‌చ్చింది.  ఈ సమావేశానికి రాజ్‌ నాథ్ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. 7 నిమిషాల ప్రసంగం తరువాత చంద్రబాబు ప్రసంగాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ అడ్డుకున్నారు. ఇచ్చిన సమయం ముగిసిందని చెబుతూ ఇక ప్రసంగాన్ని ఆపాలని చెప్పారు. ఏపీ సమస్యలు ప్రత్యేకమైనవంటూ చంద్రబాబు ప్రసంగాన్ని కొనసాగించడంతో రాజ్‌ నాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా, మరో నాలుగేళ్ల‌లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటూ కేంద్రం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరేందుకు నీతిఆయోగ్ రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని కోరనుంది. ఇటీవలి కాలంలో నీతిఆయోగ్ ప్రతిపాదించిన పలు వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణల పట్ల పలు రాష్ర్టాలు సానుకూలంగా స్పందించలేదు. ఈ నేప‌థ్యంలో ప్రధాని అధ్యక్షతన జ‌రుగుతున్న‌ ఈ సమావేశంలో దేశంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించనున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు కేంద్రం రాష్ర్టాల మద్దతును కోరనుంది. ఈ పథకం కింద దేశంలోని 50 కోట్ల మందికి ఆరోగ్య బీమా కల్పించనున్నారు. శిశువులకు - తల్లులకు రోగ నిరోధక టీకాలు ఇచ్చే మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమ విస్తరణ అంశం సమావేశం ఎజెండాలో ఉంది. వచ్చేఏడాది మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని నిర్వహించబోయే కార్యక్రమాల గురించి చర్చిస్తారని చెప్పారు. పోషకాహారం, కొత్త జిల్లాల ఏర్పాటుకు డిమాండ్లపై చర్చ జరుగుతుంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రధాని నిర్దేశించిన లక్ష్యానికి గడువు సమీపిస్తున్న నేపథ్యంలో.. గత మూడేళ్ల‌లో నీతి ఆయోగ్ ప్రతిపాదించిన సంస్కరణలను రాష్ర్టాలు తప్పనిసరిగా చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Tags:    

Similar News