గవర్నర్‌ను ఢిల్లీకి రమ్మన్న రాజ్‌నాథ్‌

Update: 2015-06-25 08:34 GMT
ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రికి ఏసీబీ నోటీసులు ఇస్తుందని.. వీలైతే కోర్టు నుంచే ఆదేశాలు వెలువడే అవకాశం ఉందన్న చర్చ ఓ పక్క జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో వాస్తవం సంగతి ఎంతన్నది పక్కన పెడితే.. ఊహాగానాలు మాత్రం భారీగా సాగుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. మరోవైపు సెక్షన్‌ 8ని హైదరాబాద్‌లో అమలు చేసేందుకు వీలుగా అటార్నీ జనరల్‌ చెప్పారన్న వార్తలు కూడా భారీగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల అధికారపక్షాల మధ్య మాటల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ను ఢిల్లీకి రమ్మంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నుంచి పిలుపు రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ మధ్యనే గవర్నర్‌ ఢిల్లీకి వెళ్లి వచ్చినప్పటికీ.. ఆయన్ను ఢిల్లీ రావాలని పిలిపించుకోవటం పట్ల పలు వాదనలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వెళుతున్న గవర్నర్‌.. రేపు ఉదయం 11 గంటలకు రాజ్‌నాథ్‌ను కలవనున్నారు.

ఇందులో ప్రధానంగా.. సెక్షన్‌ 8 పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఆలోచన ఏమిటి? తెలంగాణ సర్కారు ఈ అంశంపై ఎలా స్పందించే అవకాశం ఉందన్న వాస్తవ విషయాల్ని తెలుసుకోవటం ఒక కారణంగా చెబుతున్నారు. ఓటుకు నోటు వ్యవహారం కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో.. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం కోసం కూడా అన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా ఓటుకు నోటు వ్యవహారంలో రాజీ ప్రయత్నాలతో పాటు.. సెక్షన్‌ 8 అమలుపై కేంద్రం దృష్టి సారించటం వల్లే గవర్నర్‌కు పిలుపు వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News