ఆయనకెంత నమ్మకమో.. గెలిచేస్తున్నారట!

Update: 2019-05-06 09:23 GMT
కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్ సింగ్‌ కు ఆత్మవిశ్వాసం బాగా మెండుగా ఉన్నట్టే కనిపిస్తోంది. ఈసారి ఆయన భారీ మెజారిటీతో గెలవబోతున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా 51 నియోజకవర్గాల్లో ఐదో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. లక్నో బరిలో ఉన్న ఆయన ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసి వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి తాను భారీ మెజారిటీతో గెలవబోతున్నట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు, మూడింట రెండొంతుల మెజారిటీ బీజేపీకి తథ్యమని జోస్యం కూడా చెప్పేశారు. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన రాజ్‌ నాథ్ రెండు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడాయన ధీమా చూస్తుంటే ఈసారి అంతకంటే ఎక్కువ మెజారిటీనే వస్తుందని అనుకుంటున్నారు.

నిన్నమొన్నటి వరకు బీజేపీలో ఉంటూనే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన శతృఘ్న సిన్హా  కాంగ్రెస్‌ లో చేరారు. ఆయన భార్య పూనం సిన్హా మాత్రం ఎస్పీలో చేరి లక్నో నుంచి బరిలోకి దిగి రాజ్‌ నాథ్‌ కు సవాలు విసురుతున్నారు. శతృఘ్న సిన్హా కాంగ్రెస్ నేత అయినప్పటికీ - లక్నోలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆధ్యాత్మిక గురువు ఆచార్య ప్రమోద్ కృష్ణన్ బరిలో ఉన్నప్పటికీ శతృఘ్న సిన్హా మాత్రం భార్యవైపే మొగ్గు చూపారు. లక్నోలో భార్యకు మద్దతుగా ప్రచారం చేసి పతిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు.

విచిత్రం ఏంటంటే.. లక్నో నుంచి బరిలో ఉన్న ముగ్గురూ గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఉండడంతో గెలుపు తనదేనని పూనం - ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పడతాయని కాంగ్రెస్ భావిస్తుండగా - కాంగ్రెస్-ఎస్పీ కూటమి ఓట్లు చీలి తమకు లాభం చేకూరుతుందని బీజేపీ భావిస్తోంది. మరి చివరికి విజయం సాధించేదెవరో తెలియాలంటే మాత్రం ఈ నెల 23 వరకు ఆగక తప్పదు!
   

Tags:    

Similar News