ఇమ్రాన్‌ పై రాజ్‌ నాథ్ అదిరిపోయే సెటైర్లు!

Update: 2019-09-28 15:24 GMT
పాకిస్థాన్ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్‌ ఖాన్ రోజు రోజుకు భార‌త్‌ పై త‌న విద్వేషాన్ని పెంచేస్తున్నారు. ఇక శుక్ర‌వారం జ‌రిగిన ఐక్య‌రాజ్య‌స‌మతి స‌మావేశాల్లోనూ ఆయ‌న‌కు 15 నిమిషాలు ప్ర‌సంగించేందుకు స‌మ‌యం ఇస్తే ఆయ‌న ప‌రిమితికి మించి ఏకంగా 50 నిమిషాల పాటు మాట్లాడారు. ఇందులో 30 నిమిషాల పాటు భార‌త్‌ ను తిట్టేందుకు టైం కేటాయించారు. అదే టైంలో చైనా సైతం ఇమ్రాన్ ప్ర‌సంగాన్ని బేస్ చేసుకుని భార‌త్‌ పై విమ‌ర్శ‌లు చేసింది. ఈ రెండు దేశాల‌పై కేంద్ర మంత్రులు విమ‌ర్శ‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ ఇమ్రాన్‌ ఖాన్‌ పై అదిరిపోయే సెటైర్లు సంధించారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రపంచంలోని గడప గడపకూ తిరిగి కార్టూనిస్టులకు కావాల్సినంత సరుకు అందిస్తున్నారని రాజ్‌‌ నాథ్ వ్యాఖ్యానించారు. యూఎన్‌ వోలో ఇమ్రాన్ క‌శ్మీర్ అంశం ప్ర‌స్తావ‌న‌కు తీసుకు వ‌స్తూ భార‌త్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంతో రాజ్‌ నాథ్ తీవ్రంగా స్పందించారు. భార‌త్ తీర ప్రాంతాల్లో కొంద‌రు మైంబై త‌ర‌హా ఎటాక్‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు... ఆ శ‌క్తుల ఆశ‌లు ఎంత మాత్రం నెర‌వేర‌వ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఐఎన్ ఎస్ ఖండేరీతో భారత నావికా దళం.... అలాగే భార‌త సైనిక ద‌ళాలు మ‌రింత‌గా ప‌టిష్టం అయ్యాయ‌న్న విష‌యం పాక్ తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు.

ఇక ఆర్టిక‌ల్ ర‌ద్దు అనేది ముగిసిన అంశ‌మ‌ని... అది భార‌త్ తీసుకున్న అత్యున్న‌త నిర్ణ‌య‌మ‌ని చెప్పిన రాజ్‌ నాథ్ ఈ నిర్ణ‌యానికి ప్ర‌పంచ దేశాల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తుంటే... పాక్ ప్ర‌ధాని మాత్రం లేనిపోని వ‌క్ర‌భాష్యాలు చెపుతూ... త‌న విద్వేషాన్ని చూపిస్తూ ప్ర‌పంచంలోని ఇంటింటికీ కార్టూనిస్టులకు కావాల్సినంత సరుకు చేరవేస్తున్నార‌ని సెటైర్లు వేశారు. ఇక హూస్ట‌న్‌ లో మోదీ కార్య‌క్ర‌మంపై సైతం రాజ్‌ నాథ్ మాట్లాడుతూ భారత్ ప్ర‌పంచంలో అజేయశక్తిగా అవతరిస్తున్న విషయాన్ని ప్రధాని తన అమెరికా పర్యటన ద్వారా చాటిచెప్పారన్నారు.

ఈ క్ర‌మంలోనే అమెరికాలో మోదీకి ల‌భించిన స్వాగ‌తం గురించి రాజ్‌ నాథ్ మాట్లాడుతూ ‘‘కిక్కిరిన ఓ స్టేడియంలో అమెరికా నాయకులు ప్రధానమంత్రికి ఎలా స్వాగతం పలికారో మనమంతా చూశాం. మన ప్రభుత్వ శక్తిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం గుర్తించారు...’’ అని కేంద్రమంత్రి కొనియాడారు. ఏదేమైనా ఒక్క చైనా మిన‌హా ప్ర‌పంచ దేశాల‌న్ని క‌శ్మీర్ అంశంతో స‌హా ఇత‌ర అంశాల్లో భార‌త్‌కు మ‌ద్ద‌తు ఇస్తుంటే త‌ట్టుకోలేని పాక్ రోజు రోజుకు భార‌త్‌పై విషం చిమ్ముతోంది.


Tags:    

Similar News