ప్ర‌ధానితో ప‌వార్ భేటీ.. ఏం జ‌రుగుతోంది?

Update: 2021-07-17 11:30 GMT
రాబోయే రోజుల్లో దేశ రాజ‌కీయాలు కీల‌క మ‌లుపు తీసుకోబోతున్నాయి. ఇప్ప‌టికే రెండు సార్లు గెలిచిన మోడీ స‌ర్కారు.. మూడో ద‌ఫా అధికారం కోసం పోటీ ప‌డ‌నుంది. అయితే.. గ‌డిచిన ప‌దేళ్ల‌లో వ‌చ్చిన స‌హ‌జ వ్య‌తిరేక‌త‌కు తోడు.. క‌రోనా నియంత్ర‌ణ‌లో విఫ‌లం, నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల వంటి చ‌ర్య‌ల‌తో బీజేపీపై దేశవ్యాప్తంగా వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఇటు చూస్తే.. కాంగ్రెస్ బ‌లం పుంజుకోలేదు.

అటు థ‌ర్డ్ ఫ్రంట్ ప్ర‌య‌త్నాలు సాగుతున్నా.. కొన్ని ప్రాంతాల‌కే ప‌రిమిత‌మైన పార్టీలు.. బీజేపీని ఎదుర్కుంటాయా? అన్న‌ది సందేహం. ఈ విధంగా దేశంలో స‌రికొత్త‌ రాజ‌కీయాలకు రాబోయే రోజులు వేదిక కానున్నాయి. అయితే.. ఇలాంటి ప‌రిస్థితుల్లో మోడీని గ‌ట్టిగా వ్య‌తిరేకించే వారిలో ముందు వ‌ర‌స‌లో ఉన్న ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ ప్ర‌ధానితో భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఈ మేర‌కు ప్ర‌ధాని కార్యాల‌యం ఈ విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించింది. వీరిద్ద‌రూ క‌లిసి చ‌ర్చించుకుంటున్న ఫొటోను కూడా షేర్ చేసింది. ''రాజ్యసభ సభ్యుడు శరద్ పవార్.. ప్రధాని మోడీతో భేటీ అయ్యారు'' అని ట్విటర్ లో తెలిపింది. మోడీ - పవార్  57 నిమిషాల పాటు మాట్లాడుకున్నార‌ని కూడా వెల్ల‌డించింది. త్వ‌ర‌లో పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభం కాబోతున్న స‌మ‌యంలో.. ఈ ఇద్ద‌రు నేత‌లు భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. శుక్ర‌వారం రాజ్య‌స‌భలో బీజేపీ స‌భాప‌క్ష నేత పీయూష్ గోయ‌ల్ తోనూ ప‌వార్ భేటీ అయ్యారు. దీంతో.. ఏం జ‌రుగుతోంది అనే చ‌ర్చ మొద‌లైంది.

అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. పార్ల‌మెంటు స‌మావేశాలు స‌జావుగా సాగే విష‌య‌మై చ‌ర్చ జ‌రిగి ఉంటుంద‌ని అంటున్నారు. లోక్ స‌భ‌లో మెజారిటీ ఉన్న ఎన్డీఏ స‌ర్కారుకు.. రాజ్య‌స‌భ‌లో త‌గిన బ‌లం లేదు. రాజ్య‌స‌భ‌లో బిల్లు పాస్ కావాలంటే.. 123 మంది స‌భ్యుల మ‌ద్ద‌తు కావాలి. కానీ.. బీజేపీకి కేవ‌లం 93 మంది స‌భ్యులే ఉన్నారు. దీంతో.. మిగిలిన ముప్పై మంది స‌భ్యుల కోసం ఇత‌ర పార్టీల‌పై ఆధార‌ప‌డాల్సి వస్తోంది.

వ్య‌వ‌సాయ చ‌ట్టాల వంటివి విదాస్ప‌దం కావ‌డంతో ప‌లు మిత్ర ప‌క్షాలు కూడా దూరం జ‌రిగాయి. వ‌చ్చే ఏడాది దాదాపు 70 మంది రాజ్య‌స‌భ స‌భ్యులు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఇందులో బీజేపీ స‌భ్యులు కూడా చాలా మందే ఉన్నారు. దీంతో.. బీజేపీ బ‌లం మ‌రింతగా ప‌డిపోనుంది. ఈ నేప‌థ్యంలో విప‌క్షాల‌ను మంచి చేసుకొని బిల్లులు గట్టెక్కించుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది బీజేపీ స‌ర్కారు. దీంతో.. ఈ విష‌య‌మై చ‌ర్చించేందుకే శ‌ర‌ద్ ప‌వార్ తో ప్ర‌ధాని, పీయూష్ గోయ‌ల్ భేటీ అయ్యారా? అనే చ‌ర్చ కూడా సాగుతోంది.

ఇదిలా ఉంటే.. థ‌ర్డ్ ఫ్రంట్ నేత‌గా శ‌ర‌ద్ ప‌వార్ పేరు బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌ధాని మోడీని ఎదుర్కొనే నేత ఆయ‌నేన‌ని అంటున్నారు. మోడీకి వ్య‌తిరేకంగా బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌, క‌మ్యూనిస్టులు, ఇత‌ర పార్టీలు క‌లిసి థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇందులో ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ప‌వారే స‌రైన వారు అని కూడా చ‌ర్చ సాగుతోంది. ఇలాంటి నేత మోడీతో స‌మావేశం కావ‌డం స‌హ‌జంగానే ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. వీరి భేటీకి సంబంధించిన వివ‌రాలు మాత్రం బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌లేదు. అందువ‌ల్ల‌.. జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌ను విశ్లేషించుకొని, ఓ అంచ‌నాకు రావాల్సి ఉంటుందని విశ్లేష‌కులు చెబుతున్నారు.

కాగా.. ఇటీవ‌ల ప్ర‌శాంత్ కిశోర్ ప‌వార్ తో వ‌రుస భేటీలు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ నేత‌ల‌ను కూడా పీకే క‌లిశారు. దీంతో.. థ‌ర్డ్ ఫ్రంట్ బాధ్య‌తలు పీకే నిర్వ‌హిస్తున్నార‌ని కొంద‌రు.. లేదు లేదు ప‌వార్ ను రాష్ట్ర‌ప‌తి పీఠం మీద కూర్చోబెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మ‌రి కొంద‌రు విశ్లేషించారు. అయితే..

 తాను ప్రెసిడెంట్ రేసులో లేన‌ని స్ప‌ష్టం చేశారు ప‌వార్‌. దీంతో.. మ‌రి ప్ర‌శాంత్ కిషోర్ తో భేటీకి ఎజెండా ఏమైఉంటుంది? అనే చ‌ర్చ సాగుతోంది. థ‌ర్డ్ ఫ్రంట్ కోస‌మేనా? మ‌రేమైనా ఇత‌ర కార‌ణాలు ఉన్నాయా? అని విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ప్ర‌ధానితో ప‌వార్ భేటీతో విశ్లేష‌ణ‌లు మ‌రింత వేడెక్కాయి. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.
Tags:    

Similar News