రాజ్యసభ నుంచి లోక్ సభకు కేవీపీ బిల్లు

Update: 2016-08-05 11:40 GMT
ఏపీ హోదాపై ఏపీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుపై మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏ క్షణంలో హోదాపై కేవీపీ ప్రైవేటు బిల్లును ప్రవేశ  పెట్టారో కానీ.. మోడీ సర్కారును ఈ బిల్లు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తొలుత ఈ బిల్లును తేలిగ్గా తీసుకున్నప్పటికీ.. ఇది కాస్తా మోడీ సర్కారుకు చుట్టుకుంటుందన్న విషయం అర్థమై ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది. ఈ బిల్లు విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా అడ్డంగా బుక్ అవుతామన్న విషయాన్ని అర్థం చేసుకున్న అధికారపక్షం ఈ బిల్లు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.

ఇందులో భాగంగా గతంలో చర్చకు రావాల్సిన ప్రాధాన్యతలో మొదటి స్థానంలో ఉన్న బిల్లును ఎక్కడో చివరకు పడేయటం దగ్గర నుంచి.. ఈ బిల్లును పక్కకు తప్పించేందుకు వీలుగా చర్యలు తీసుకోవటం కనిపించింది. ఈ రోజు.. కేవీపీ ప్రైవేటు బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరుగుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్న వేళ.. మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కేవీపీ ప్రవేశ పెట్టిన బిల్లు మనీ బిల్లుగా అభ్యంతరాలు వ్యక్తం కావటంతో ఈ బిల్లును రాజ్యసభ  నుంచి లోక్ సభకు పంపుతున్నట్లుగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు.

రాజ్యసభలో చర్చ పూర్తి అయిన ఒక ప్రైవేటు మెంబరు బిల్లు.. ఓటింగ్ కు సిద్ధంగా ఉన్న సమయంలో ఆ బిల్లు మనీ బిల్లా? కాదా? అన్న అంశాన్ని నిర్ణయించే అధికారం రాజ్యసభకు లేదని.. అభ్యంతరాలు వచ్చినప్పుడు పరిశీలించే అధికారం ఉన్నప్పటికీ.. అదెలాంటి బిల్లు అన్న విషయాన్ని తేల్చే అధికారం రాజ్యసభకు లేదని కురియన్ ప్రకటించారు.దీంతో.. కేవీపీ ప్రైవేటు బిల్లు ఇక లోక్ సభకు వెళ్లనుంది. మరో కీలకమైన అంశం ఏమిటంటే.. ఈ రోజున బిల్లు లోక్ సభకు వెళ్లనున్న నేపథ్యంలో.. మళ్లీ ఈ బిల్లుపై చర్చ ఏం జరిగినా.. శీతాకాల సమావేశాల్లో మాత్రమే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏమైనా కేవీపీ ప్రైవేటు బిల్లును ఓటింగ్ కు రాకుండా చేయటంలో ఏన్డీయే సర్కారు సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు.
Tags:    

Similar News